సమస్యలు పరిష్కరించకుంటే ఉధృత పోరాటాలు

కార్మికుల సమస్యలు

మాట్లాడుతున్న తేజేశ్వరరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలను ఉధతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు హెచ్చరించారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంఘ జిల్లా విస్తృత సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల పదో తేదీన అఖిల భారత కోర్కెల దినాన్ని పురస్కరించుకుని పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని పైడిభీమవరం పారిశ్రామిక ప్రాంతంలో హైడ్రాలిక్‌ ఫోమ్‌ ఫైర్‌ ఇంజిన్‌ను ఏర్పాటు చేసి పరిశ్రమల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. శ్యామ్‌క్రగ్‌ పిస్టన్స్‌ అండ్‌ రింగ్స్‌ యాజమాన్యం 30 ఏళ్లు సర్వీసు పూర్తయిన కార్మికులను అన్యాయంగా విధుల నుంచి తొలగించిందని, వారిని తక్షణమే విధులోకి తీసుకోవడంతో పాటు వేతన ఒప్పందం చేయాలని డిమాండ్‌ చేశారు. నీలం జ్యూట్‌ పరిశ్రమను వెంటనే తెరిపించాలన్నారు. యునైటెడ్‌ బ్రేవరీస్‌, రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, అరబిందో, మందస రైస్‌మిల్లు కార్మికుల చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. రిమ్స్‌ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించి ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ క్రమబద్ధీకరించాలన్నారు. గ్రానైట్‌ పరిశ్రమను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నభోజన పథకం, వెలుగు, మెప్మా, ఉపాధి హామీ, సేంద్రియ వ్యవసాయం, 108, 104 తదితర స్కీమ్‌ల వారీగా కార్మికులను ప్రభుత్వం గుర్తించి కనీస వేతనాలు చెల్లించడంతో పాటు పెన్షన్‌, సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎలకు టైమ్‌ స్కేల్‌ అమలు చేసి అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, కంటింజెంట్‌, పార్ట్‌ టైమ్‌, గెస్ట్‌ తదితర ఉద్యోగ, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని రెగ్యులర్‌ చేయాలన్నారు. సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు కె.సూరయ్య, ఎన్‌.వి రమణ, ఎన్‌.గణపతి, హెచ్‌.ఈశ్వరరావు, జి.అమరావతి, బి.ఉత్తర, ఆర్‌.ప్రకాష్‌, పి.లతాదేవి, ఎన్‌.బలరాం తదితరులు పాల్గొన్నారు.

➡️