డ్వాక్రా బజారు ఉత్పత్తులు
84 స్టాల్స్‌లో ఉత్పత్తుల విక్రయాలు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా సంయుక్తంగా నిర్వహిస్తున్న సిక్కోలు డ్వాక్రా బజారులో స్వయంశక్తి సంఘాలు విక్రయిస్తున్న ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద గల మున్సిపల్ మైదానంలో నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. సంక్రాంతి దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రంలో 101 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు 84 స్టాళ్లలో పలురకాల చేతి ఉత్పత్తులను ప్రదర్శించి అమ్ముతున్నారు. రూ.1.50 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బజారును ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ సుమారు రూ.30 లక్షల మేర విక్రయాలు సాగిస్తున్నారు.డ్వాక్రా బజారులో ప్రత్యేక ఆకర్షణలుపలురకాల ఉత్పత్తులైన మంగళగిరి నేత చీరలు, కడప హాండ్‌లూమ్స్, లావేరు జూట్ బ్యాగ్స్, బుడితి ఇత్తడి, మందస కోవా, కొయ్యబొమ్మలు, ఆత్రేయపురం పూతరేకులు, మాడుగుల హల్వా, ఆమదాలవలస సేంద్రీయ బెల్లం, గుంటూరు కారం, పచ్చళ్లు, రణస్థలం చిరుధాన్యాల బిస్కెట్లు, పాతపట్నం ఇండోర్ ప్లాంట్స్ వంటి పలురకాల ఉత్పత్తులు ఈ బజారులో అందుబాటులో ఉన్నాయి. అలమండ మామిడితాండ్ర, సీతంపేట హెర్బల్, పొందూరు ఖాదీ, అనకాపల్లి ఏటికొప్పాక బొమ్మలు, వజ్రపుకొత్తూరు ఎండుచేపలు, నెత్తళ్లు, ఎచ్చెర్ల అప్పడాలు, గార మట్టి కుండలు, సరుబుజ్జిలి అగరబత్తులు ఇక్కడ ఆకర్షణగా నిలుస్తున్నాయి.సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలుడ్వాక్రా బజారుకు వచ్చే వారికి అక్కడే ప్రధాన వేదికపై నిర్వహిస్తున్న కూచిపూడి, మిమిక్రీ, మాట్లాడే బొమ్మ, మ్యాజిక్ షో, కోలాటం వంటి కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన పలురకాల ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడంతో పాటు చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఆహార పదార్థాలు, సేంద్రీయ ఉత్పత్తులు మార్కెట్ రేటు కంటే ఇక్కడ తక్కువ ధరలకు అమ్ముతున్నారు.