- ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, శోభాయాత్ర
- రసవత్తరంగా గ్రామీణ క్రీడా పోటీలు
- ప్రారంభమైన అరసవల్లి రథసప్తమి వేడుకలు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ పండగగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆదివారం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సామూహిక సూర్య నమస్కారాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు ఐదు వేల మంది సూర్య నమస్కారాలు చేశారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శోభాయాత్ర ఆకట్టుకుంది. గ్రామీణ క్రీడా పోటీలు రసవత్తరంగా సాగాయి. జిల్లాలో తొలిసారి ఏర్పాటు చేసిన టూరిజం హెలీకాప్టర్ రైడ్ కొత్త అనుభూతినిచ్చింది.
ఆకట్టుకున్న హెలీకాప్టర్ రైడ్
నగరంలోని డచ్ భవనం వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యాన చేపట్టిన హెలీకాప్టర్ రైడ్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, మంచు కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక్కో ట్రిప్పుకు ఏడుగురు ప్రయాణించేందుకు వీలు కల్పించారు. ఎనిమిది నిమిషాల్లో గగన మార్గంలో ఏడు ఆలయాలను చూసేందుకు ఒకరికి టిక్కెట్ రూ.1800 వసూలు చేశారు. నగర వాసులు హెలీకాప్టర్ ఎక్కేందుకు ఆసక్తి చూపించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణం చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి, ఆర్‌డిఒ సాయి ప్రత్యూష, డ్వామా పీడీ సుధాకర్ హెలీకాప్టర్ రైడ్ చేశారు.
శోభాయమానంగా శోభాయాత్ర
నగరంలోని డేఅండ్‌నైట్ కూడలి నుంచి అరసవల్లి ఆలయం వరకు నిర్వహించిన శోభాయాత్రను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, థింసా, కోయ, కొమ్ము నృత్యాలు, పలు ఆలయాల ప్రచార రథాలు, మంగళ వాయిద్యాలతో కృష్ణాపార్కు, ఏడు రోడ్ల కూడలి, జి.టి రోడ్డు, సూర్యమహల్ కూడలి మీదుగా అరసవిల్లి వరకు శోభాయాత్ర సాగింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు చిత్రాలు మాట్లాడుతాయి పేరుతో ‘సమగ్రత-సమానత్వం’ అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో 645 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
రథసప్తమి వేడుకల్లో సాంస్కృతిక సందడి
రథసప్తమి వేడుకల్లో భాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ప్రముఖ కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వేడుకల్లో భాగంగా లైట్ మ్యూజిక్, సినీ సంగీతం, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ జానపద సంగీతం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు జరిగాయి. ప్రముఖ కళాకారులు తమ గాన, నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, నరేష్, శాంతి స్వరూప్, ఫైమా, ఢ భూమిక, రేలారే రేలా టీమ్, మిమిక్రీ ఆనంద్, జోష్ శివ, పిన్సి సాంగ్ ఫేమ్ షణ్ముఖ్, సురేష్ రేష్మ (సింగింగ్), బాలాజీ వంటి ప్రముఖులు పాల్గొన్న ధూంధాం కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆటో రాంప్రసాద్ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. జిల్లాలో తొలిసారి పరిచయం చేసిన లేజర్ షో ఆకర్షణగా నిలిచింది. ఈ షోలో రంగురంగుల కాంతులు ఆకాశంలో పలు ఆకారాలుగా ఏర్పడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. శ్రీ అంజనా కళా సంస్థ సమర్పించిన పంచరత్న పౌరాణిక నాటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ నాటకాలు ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించాయి. మరిన్ని కళా, సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలను సోమవారం కూడా నిర్వహించనున్నారు.
రసవత్తరంగా క్రీడా పోటీలు
నగరంలోని ఎన్‌టిఆర్ మున్సిపల్ మైదానంలో రాష్ట్రస్థాయి వాలీబాల్, జిల్లాస్థాయి వెయిట్‌లిప్టింగ్, గ్రామీణ క్రీడలైన కర్రసాము, సంగిడీలు, ఉలవల బస్తా లిఫ్టింగ్ తదితర క్రీడా పోటీలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. తొలి రోజున ఆరు జిల్లాల నుంచి వాలీబాల్ క్రీడాకారులు తలపడ్డారు.