వర్గీకరణతో అన్యాయం

ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్‌ కోటాలో మార్పులు

మాట్లాడుతున్న హర్షకుమార్‌

మాజీ ఎంపీ జి.వి హర్షకుమార్‌

ప్రజాశక్తి – టెక్కలి

ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్‌ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దళితులకు అన్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ జి.వి హర్షకుమార్‌ అన్నారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యాన స్థానిక ఆదిత్య కళ్యాణ మండపంలో ‘ఎస్‌సి, ఎస్‌టిల రిజర్వేషన్‌ వర్గీకరణ-క్రిమిలేయర్‌కు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ’ అంశంపై ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు దళితులను వంచన చేశాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న దళితుల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు వారి సమస్యలపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాధికారంతోనే దళితుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. దళితులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన ఆవసరం ఉందన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని, దీనిపై సుప్రీంకోర్టు ఎలా తీర్పు ఇస్తుందన్నారు. 342 ఆర్టికల్‌ను మార్చి రాజ్యాంగ సవరణ చేశారా ఆని ప్రశ్నించారు. వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రం నుంచి 34 మంది రివ్యూ పిటిషన్లు వేశారని చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే దళితులకు అన్యాయం ప్రారంభమైందని తర్వాత వచ్చిన పాలకులు వాటిని కొనసాగిస్తూ మరింత పటిష్టం చేస్తున్నారని విమర్శించారు. దళితులకు అందాల్సిన పలు సంక్షేమ పథకాలనూ రద్దు చేశారని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మాల మహానాడు వ్యవస్థాపకులు కె.బి.ఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ 59 ఉప కులాలుగా ఉన్న దళితులు రాజాకీయంగా ఎదగాలన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి తిరుపతి లడ్డూపై పాలకులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మాల ఉద్యోగుల సంఘ రాష్ట్ర కన్వీనర్‌ ఎన్‌.భరత్‌భూషణ్‌ మాట్లాడుతూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ పాలకులు స్వప్రయోజనం కోసం చూస్తున్నారని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్‌ బోకర నారాయణరావు, చల్లా రామారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో టెక్కలి ఎంపిపి ఆట్ల సరోజనమ్మ, సినీ నిర్మాత బలగ ప్రకాష్‌, కురమాన దాలయ్య, కుప్పిలి కామేశ్వరరావు, దూసి ఆంధ్రాస్టాలిన్‌, దేబారికి రామప్పడు, పెయ్యిల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️