సచివాలయంలో విచారణ నిర్వహిస్తున్న ఎపిడి లోకేష్
ప్రజాశక్తి- ఆమదాలవలస
మండలంలోని తోటాడ గ్రామ ఫీల్డు అసిస్టెంట్ పైడి సత్యనారాయణపై అదే గ్రామానికి చెందిన తాండ్ర రంగారావు, కొంతమంది గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఉపాధిహామీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకేష్ విచారణ చేపట్టారు. శుక్రవారం తోటాడ సచివాలయంలో ఉపాధిహామీ కూలీల సమక్షంలో విచారణ నిర్వహించారు. ఫీల్డు అసిస్టెంట్ గ్రామంలో లేని వారి పేరిట మస్టర్లు వేసి నిధులు దుర్వినియోగం చేశారని గ్రామస్తులు, పలువురు కూలీలు విచారణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా ఎస్‌ఐ కె. వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. పలువురు కూలీల నుంచి ఏపీడీ లోకేష్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ సందర్బంగా ఎపిడి మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీల ఫిర్యాదు మేరకు విచారణ చేశానని, డ్వామా పీడీ చిట్టిరాజుకు నివేదిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎపిఒ సురవరపు లక్ష్మీనరసమ్మ, దూసి పిహెచ్‌సి మాజీ చైర్మెన్ హనుమంతు బాలకృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.