ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈనెల ఐదో తేదీ నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు గతంలో అమల్లో ఉన్న జంబ్లింగ్ విధానాన్ని మార్చి ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులను పర్యవేక్షకులుగా నియమించారు. ఒకేషనల్ విద్యార్థులకు ఈనెల ఐదో తేదీ నుంచి మొదటి విడత పరీక్షలు ఆరంభమవుతాయి. ఒకేషనల్ విద్యార్థులకు మూడు విడతల్లో నిర్వహిస్తారు. ఎంపిసి, బైసిపి విద్యార్థులకు మాత్రం ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.సబ్జెక్టుల వారీగా 30 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. అందులో రికార్డులకు 5, ప్రయోగాలకు 25 మార్కులు ఉంటాయి. రెండింటిలో కలిపి 11 మార్కులు వస్తే ఉత్తీర్ణులు అవుతారు. సిసి కెమెరాల పర్యవేక్షణలో ప్రయోగాలు నిర్వహించాలి. కొన్ని కళాశాలల్లో సిసి కెమెరాలు కూడా లేవు. ప్రయోగ పరికరాలున్నా ఎప్పుడూ ఉపయోగించింది లేదు. పరీక్షల కోసం పరికరాల దుమ్ము దులుపుతున్నారు. చాలా కళాశాలలకు రసాయనాలు కూడా అందుబాటులో లేవు.
వృత్తి విద్యా కోర్సులకు పరికరాల కొరత
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపిసి, బైసిపితో పాటు వృత్తి విద్యా కోర్సులన్నింటికీ ఇక్కడే ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. సాధారణ గ్రూపులకు సంబంధించిన అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నా, వృత్తి విద్యా కోర్సులకు సరైన పరికరాలు అందుబాటులో లేవు. ఎంఎల్‌టి గ్రూపునకు స్టాఫ్ వాచ్, స్టెతస్కోప్, రక్త గ్రూపు నిర్ధారణ కిట్లు, క్రియాటిన్ కిట్, ఎలక్ట్రోల్ బ్యాలెన్స్ కిట్లు అందుబాటులో లేవు.
పరీక్షల నిర్వహణకు కమిటీలు
ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు పర్యవేక్షకులను కమిటీ సమక్షంలో నియమించాం. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశాం. సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కేంద్రాలున్న కళాశాలలను ఆదేశించాం. విద్యార్థుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే ఆయా కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం.
– పి.దుర్గారావు, ఆర్‌ఐఒ
జూనియర్ కళాశాలలు : 145
ప్రాక్టికల్స్ పరీక్షల కేంద్రాలు: 73
మొత్తం విద్యార్థులు: 24,602