- పరిశ్రమలు, ఉద్యోగాలంటూ కూటమి నేతలు తెగ ప్రచారం
- టిడిపి హయంలో విశాఖలో రెండు పర్యాయాలు పారిశ్రామిక సమ్మిట్‌లు
- జిల్లాలో కొత్తగా ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాని వైనం
- శ్రీకాకుళంలో ‘ఇన్వెస్ట్ ఇన్ శ్రీకాకుళం’ పేరిట త్వరలో సదస్సు
దేశంలో ఎక్కడికి వెళ్లినా జిల్లాకు చెందిన కార్మికులే కనిపిస్తారు. ‘జిల్లాకు కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. జిల్లా నుంచి కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోకుండా ఇతర ప్రాంతాలే జిల్లా వైపు చూసేలా అభివృద్ధి చేస్తాం’… ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ఇవే మాటలు చెప్తూనే ఉన్నారు. జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటు విషయం పక్కన పెడితే, ఉన్న పరిశ్రమలు మూతపడుతున్న పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల పరంపర కొనసా గుతూనే ఉంది. టిడిపి కూటమి ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు కేంద్ర, రాష్ట్ర మంత్రుల నోట వెంట అవే పలుకులు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళంలో ‘ఇన్వెస్ట్ ఇన్ శ్రీకాకుళం’ పేరుతో సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పారిశ్రామిక స్థితిగతులపై కథనం.
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఇథనాల్, పేపర్, ఫార్మాస్యూటికల్స్ పవర్ జనరేషన్, గ్రానైట్ వంటి భారీ, మెగా పరిశ్రమలు 40 వరకు ఉన్నాయి. వీటి ద్వారా 63,070 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తోంది. వీటితో పాటు రైస్ మిల్లులు, జీడిపప్పు పరిశ్రమలు, పేపర్ ప్లేట్ ఉత్పత్తులు, పాలిథిన్ క్యారీ బ్యాగులు, ఇత్తడి వంటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 4,083 ఉన్నాయి. జిల్లాలో 2014 నుంచి 2024 మధ్య కాలంలో కొత్తగా ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. 2014 నుంచి 2019 వరకు టిడిపి హయాంలో విశాఖలో రెండు పర్యాయాలు పారిశ్రామిక సమ్మిట్‌ల నిర్వహించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చెప్పారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల పరిశ్రమలు, తయారీ రంగం యూనిట్లు వస్తాయన్నారు. జిల్లాకు ఇప్పటివరకు ఒక్కటీ రాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం హయాంలోనూ కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. పాత వాటికే దిక్కులేని వైనంరణస్థలం మండలం సంచాంలో ఏడాదికి తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల మందుల ఉత్పత్తితో రూ.350 కోట్లతో బల్క్ డ్రగ్ ఉత్పత్తులను ప్రారంభించేందుకు హైయాసింథాస్ ఫార్మా ప్రయివేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. పరిశ్రమలో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి కల్పిస్తామని అంగీకరించింది. పరిశ్రమకు కావాల్సిన 11.41 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పగించాల్సి ఉంది. పరిశ్రమ ఏర్పాటు చేయనున్న ప్రాంతం అనువైనదేనని అధికారులు తనిఖీ చేసి నిర్ధారించారు. ఇప్పటికీ భూమి అప్పగింతలో ఆలస్యమవుతోంది. అదే మండలంలోని చిట్టివలసలో రూ.720 కోట్లతో ఏడాదికి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ఔషధాలు ఉత్పత్తి చేసేందుకు సంబంధిత యాజమాన్యం ముందుకొచ్చింది. పరిశ్రమలో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి కల్పించేందుకు అంగీకరించింది. పరిశ్రమకు 13.91 ఎకరాల భూమి కావాల్సి ఉంది. ప్రస్తుతం భూ పరిపాలన ముఖ్య కమిషనర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతం అనువైనదేనని అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. ఎచ్చెర్ల మండలం అల్లినగరంలో రూ.65 కోట్లతో రసాయనిక పరిశ్రమ ఏర్పాటుకు ఎన్‌ఎసిఎల్ ముందుకొచ్చింది. పరిశ్రమలో 200 మందికి ఉపాధి కల్పిస్తామని అంగీకరించింది. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి.భూములు తీసుకోవడమే పారిశ్రామిక అభివృద్ధా?రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పారిశ్రామిక అభివృద్ధిగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో టిడిపి హయంలోనే ప్రమాదకర కొవ్వాడ అణు విద్యుత్కేంద్రం పేరుతో 5070 ఎకరాలు తీసుకున్నారు. భావనపాడు పోర్టు కోసం ఐదు వేల ఎకరాలు బలవంతంగా సేకరించేందుకు ప్రయత్నించగా ప్రజలు, రైతులు తిరగబడడంతో టిడిపి హయంలో సేకరణ ఆగింది. భావనపాడు స్థానంలో మూలపేట పోర్టు నిర్మాణానికి వైసిపి ప్రభుత్వానికి అది ప్రేరణనిచ్చింది. తొలి దశలో రైతుల నుంచి 500 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మూలపేట ప్రాంతంలో పది వేల ఎకరాలతో ఇండిస్టియల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు. అది చాలదన్నట్లు మందస ప్రాంతంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములు సేకరించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది.మూతపడ్డ పరిశ్రమలు తెరిపిస్తే అదే పదివేలుకొత్త పరిశ్రమలు తీసుకొస్తామని చెప్తున్న కూటమి నేతలు జిల్లాలో ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి కల్పించే ఆమదాలవలస చక్కెర పరిశ్రమను తెరిపించే విషయం కనీసం నోరెత్తడం లేదు. పైగా రూ.వందల కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ స్థలాలను తమ అనుయాయులకు కారుచౌకగా కట్టబెట్టేందుకు అక్కడ ఇండిస్టియల్ పార్కు ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. జిల్లాలో ముడిసరుకు లభ్యం కాక విద్యుత్ ఛార్జీలు, ఇతర పన్నులు భరించలేక అనేక చిన్నాచితకా పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిలో జ్యూట్ పరిశ్రమలు ప్రధానమైనవి. జిల్లాలో జ్యూట్ పరిశ్రమల మూతపై గత వైసిపి ప్రభుత్వ హయాంలో అధ్యయనం చేసి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అప్పటి వైసిపి ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటి తెరిపించే విషయం నోరెత్తడం లేదు. వీటితోపాటు కాన్‌కాస్ట్, సింథటిక్, ప్లాస్టిక్ తదితర చిన్నాచితకా పరిశ్రమలూ మూతపడ్డాయి. వీటిని తెరిపించే ప్రయ త్నం చేయకుండా పెట్టుబడులు, పరిశ్రమలు అం టూ కూటమి నేతలు పాత రాగమే ఆలపిస్తున్నారు.