రాజ్యాంగం గొప్పతనం ఇప్పుడు తెలిసొచ్చిందా?

అధికారంలో ఉన్నప్పుడు పౌరుల హక్కులపై ఉక్కుపాదం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

అధికారంలో ఉన్నప్పుడు పౌరుల హక్కులపై ఉక్కుపాదం మోపడం, అక్రమ నిర్బంధాలతో స్వేచ్ఛను హరించండం, ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని, ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛను హరిస్తున్నారంటూ గోల పెడుతుండటం బూర్జువా పార్టీలకే చెల్లుతుంది. వైసిపి ఏలుబడిలో ప్రజా ఉద్యమాలను ఎంతగా అణగదొక్కారో మనం చూశాం. స్కీం వర్కర్లు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు చలో విజయవాడ చేపట్టిన సందర్భాల్లో వారిని ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసిన ఘటనలు చాలా చూశాం. ఆందోళనలకు పిలుపునివ్వడమే చాలు పోలీసులు వేకువ జామునే సిఐటియు, స్కీం వర్కర్ల ఇళ్ల ముందు వాలిపోయేవారు. ఆంక్షలు తప్పించుకుని ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు బస్సులు, ట్రైన్‌ల్లో వెళ్తున్న వారిని పట్టుకుని పోలీసుస్టేషన్లకు తీసుకొచ్చేవారు. ఆందోళనకారుల కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్లకు తీసుకువెళ్లి, మార్గంమధ్యలో ఉన్నవారిని సైతం ఇళ్లకు రప్పించిన ఘటనలు ఎవరూ మరిచిపోయి ఉండరు. సిపిఎస్‌ రద్దు కోసం విజయవాడ వెళ్తారన్న సమాచారంతో పోలీసులు ఏకంగా స్కూళ్లకే వెళ్లిపోయారు. పిల్లలకు ఉపాధ్యాయులు లోపల పాఠాలు చెప్తుంటే బయట పోలీసులు కాపలా కాసిన సందర్భాలూ లేకపోలేదు. రాజకీయ ప్రత్యర్థులను ఎంతగా వేటాడిందో వేరే చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడును ఇఎస్‌ఐ మందుల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ పోలీసులు నిమ్మాడలో ఆయన ఇంటిని చుట్టుముట్టి అరెస్టు చేయడంతో పాటు ఆపరేషన్‌ చేయించుకున్నారన్న కనీసం కనికరం లేకుండా విజయవాడ వరకు వాహనంలో తిప్పింది. శుక్రవారం వస్తే చాలు టిడిపి నాయకులు ఎవరిని ఎక్కడ అరెస్టు చేస్తారో? అని భయబ్రాంతులకు గురి చేసేలా ఎసిబి, సిఐడి పోలీసులను ప్రయోగించింది. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు వైసిపి సాగించిన అరెస్టుల పర్వానికి పరాకాష్టగా నిలిచింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే కేసు, జగన్‌ను తిడితే అరెస్టు అన్న రీతిలో నాటి వైసిపి పాలన సాగింది రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందంటూ టిడిపి నేతలు అరిచి గోల పెట్టారు. వైసిపి అధికారంలో ఐదేళ్లూ వారి రక్షణ కోసం రాజ్యాంగాన్ని స్మరించుకున్నారు. రాజ్యాంగ అవతరణ దినోత్సవమైన నవంబర్‌ 26వ తేదీన టిడిపి శ్రేణులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగం గొప్పదనంపై వివ రించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వప రంగా రాజ్యాంగ దినోత్సం చేశారే తప్ప పార్టీ తరుపున ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం చూస్తుంటే వారికి రాజ్యాంగం నామస్మరణ పెద్దగా అవసరం లేదా అని జనం అనుకుంటున్నారు.టిడిపి శ్రేణులపై నాడు వైసిపి ప్రభుత్వం ఏ తరహాలో చెలరేగిందో అదే తరహాలో నేటి కూటమి ప్రభుత్వం ఆ పార్టీ నాయకులకు రుచిచూపిస్తోంది. వైసిపి నాయకులు, శ్రేణులపై కేసుల ఇన్సింగ్‌ ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చేస్తామంటూ ఒకవైపు చెప్తూనే చట్ట ప్రకారమే కక్ష సాధింపులకు దిగుతున్నట్లుగా పలువురిపై నమోదు చేస్తున్న కేసుల చూస్తే తెలుస్తోంది. వైసిపి నాయకుడు బోరుగడ్డ అనీల్‌పై ఎక్కడిక్కడ కేసులు నమోదు చేసి ఆయన్ను రాష్ట్ర మంతటా తిప్పి ప్రత్యక్ష నరకం ఏంటో చూపించాలనుకుంటున్నట్లుగా ఉంది. చంద్రబాబు, లోకేష్‌ను దూషించారంటూ గారలో కేసు నమోదు చేయించి శ్రీకాకుళంలో అరెస్టు చూపించారు. వైసిపికి చెందిన పెద్దిరెడ్డి సుధారాణిని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బత్తిలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టి జిల్లాకు తీసుకొచ్చారు. తప్పు చేసిన వారిని శిక్షించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. వారు ఉన్న ప్రాంతంలో కాకుండా రాష్ట్ర మంతటా కేసులు నమోదు చేయించి అరెస్టులు చేయించడం వంటి కక్ష సాధింపు చర్యలను ప్రజలు స్వాగతించారు. రాష్ట్ర మంతటా తమ నాయకులను, పార్టీ శ్రేణులను అక్రమ అరెస్టులు చేస్తూ టిడిపి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ గోలపెట్టడం ఇప్పుడు వైసిపి వంతయ్యింది. గతంలో టిడిపి వినిపించిన డైలాగ్‌నే ఇప్పుడు వైసిపి వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26న ఘనంగా నిర్వహించాలని, కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్టులపై నిరసనలు తెలపాలని పిలుపునిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న వైసిపికి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ఔచిత్యం ఇప్పుడు తెలిసినట్లుంది. రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదని, రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ విమర్శలకు దిగటం మనం చూస్తున్నాం. ధర్మో రక్షిత రక్షిత: అని పెద్దలు ఊరకనే చెప్పలేదు. ధర్మాన్ని (రాజ్యాంగాన్ని) మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది. రాజ్యాంగం అమలుపై టిడిపి, వైసిపి ఒకరినొకరకు నిందించుకుంటూ రాజ్యాంగానికి అసలు ప్రమాదకరంగా ఉన్న బిజెపిని ఇరు పార్టీలు వదిలేస్తున్నాయి. బిజెపికి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ ఒకరిద్దరు బిజెపి ఎంపిలు, నేతలు సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకటించడం చూశాం. బహుశా ప్రజలు కూడా రాజ్యాంగానికి బిజెపితో ముప్పు ఉందని గ్రహించినట్టు ఉంది. బిజెపికి 400 సీట్లు కాదు కదా? కనీసం మెజార్టీ సీట్లను ఇవ్వకుండా కర్రకాల్చి వాత పెట్టారు. అయినప్పటికీ బిజెపితో లౌకికవాదానికి ప్రమాదం పొంచే ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా మతాల మధ్య చిచ్చు రాజేసి చలి కాచుకోవాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నిరంతరం ప్రయత్నిస్తుంటూనే ఉంటాయి. ప్రజలు అప్రమత్తం గా ఉండి వాటి ప్రయత్నాలను తిప్పిగొట్టాలి.

➡️