ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజనులు
ప్రజాశక్తి- మెళియాపుట్టి
మెళియాపుట్టి మండల కేంద్రంలో ఐటిడిఎ ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు డిమాండ్ చేశారు. అఖిలభారత రైతు కూలి సంఘం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యాన మెళియాపుట్టిలో శనివారం భారీ ర్యాలీ, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం తర్వాత దేశవ్యాప్తంగా ఆదివాసీలకు ఐటిడిఎ వచ్చిందన్నారు. జిల్లాల విభజన తరువాత జిల్లాకు ఐటిడిఎ లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జిల్లాల విభజన సమయంలో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. ఇప్పుడు జిల్లా ఎనిమిది నియోజకవర్గాలతో ఏర్పడిందని, 16 మండలాల్లో ఆదివాసీలు ఉన్నారని అన్నారు. అలాగే ఐదు సబ్ ప్లాన్ మండలాలు ఉన్నాయన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మెళియాపుట్టిలో ఐటిడిఎ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు కూలి సంఘం చేస్తున్న ఆందోళనకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీలకు రూల్ ఆఫ్ రోస్టర్ ఆరు శాంతం ఉంటే అందులో కూడా దొంగ ధ్రువపత్రాలతో నాలుగు శాతం గిరిజనేతరులు ఉద్యోగాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ సమస్యలపై ప్రశ్నించడానికి జిల్లాలో ఎస్‌టి నియోజకవర్గం లేకపోవడం అన్యాయమన్నారు. మెళియాపుట్టి కేంద్రంగా ఐటిడిఎ ఏర్పాటుకు భౌగోళికంగా అన్ని విధాలుగా బాగుంటుందని అన్నారు. అనంతరం తహశీల్దార్ బడే పాపారావును కలిసి వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, సర్పంచ్‌లు సవర వెంకటేష్, జమ్మయ్య, భాస్కరరావు, పాపారావు, గౌరేసు, జనార్థన, ఆదివాసీ సంక్షేమ పరిషత్ సభ్యులు గణేష్, శ్రీను, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి వినోద్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎఐఎఎంఎస్ జిల్లా అధ్యక్షులు మామిడి భీమారావు, ఎస్‌ఎస్‌టియు జిల్లా కన్వీనర్ జుత్తు వీరాస్వామి పాల్గొన్నారు.