ర్యాలీని ప్రారంభిస్తున్న జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
కిడ్నీ వ్యాధి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దీని బారిన పడకుండా ఉండేందుకు జీవనశైలి మార్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా స్థానిక జిజిహెచ్‌లో నిర్వహించిన అవగాహన ర్యాలీని గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కిడ్నీ వ్యాధులపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో పలు సంస్థలు రానున్నాయన్నారు. కిడ్నీ వ్యాధిని త్వరగా గుర్తించేందుకు హార్వర్డ్, నార్త్ కెరోలీనా, కొలంబియా సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, ఐఎఎస్‌సి బెంగుళూరు యూనివర్సిటీలతో వారందరితో కలిపి పరిశోధనలు చేసే ఆలోచనతో ఉన్నట్లు వివరించారు. ఉప్పు తక్కువగా వాడడం, రోజూ తాగునీరు తగు మోతాదులో తీసుకొని ప్రతిరోజూ వ్యాయామం చేయాలని చెప్పారు. కిడ్నీ సమస్యను గుర్తించేందుకు ఏటా కిడ్నీ పరీక్షలు చేయిస్తే మొదటి దశలోనే గుర్తిస్తే వైద్యులు సులువుగా వైద్యం చేస్తారని వివరించారు. జిజిహెచ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఆల్కహాల్, పొగ తాగడం ఆపాలని, జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కిడ్నీ వ్యాధికి 60 శాతం కిడ్నీ వ్యాధి హైపర్ టెన్షన్, షుగర్‌లే కారణమన్నారు. ఇవి కంట్రోల్‌లో ఉంటే 60 శాతం కిడ్నీ వ్యాధిని ఆపవచ్చని తెలిపారు. స్పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ వ్యాధి వస్తుందన్నారు. ఉద్దాన ప్రాంతంలో వచ్చే కిడ్నీ వ్యాదులకు వేరే కారణాలు ఉన్నట్లు పరిశోధనలో తేలినట్లు వివరించారు. ఈ ప్రాంతంలో వచ్చే కిడ్నీ వ్యాధి లక్షణాలు కనబడవని, కాలు వాపులు, అలసట, తదితరమైన లక్షణాలు ఉండవన్నారు. అనుమానం వచ్చి పరీక్షలు చేస్తే క్రియాటిన్ 3 లేదా 4 ఉంటుందని చెప్పారు. డిసిహెచ్ డాక్టర్ కళ్యాణ్ బాబు, జిజిహెచ్ సూపరింటెండెంట్ షకీల మాట్లాడుతూ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 106 వరకు డయాలసిస్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు వివరించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 12 రకాల మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ర్యాలీలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బాలమురళీకృష్ణ, నెఫ్రాలజిస్ట్ కొర్ల విద్యాసాగర్, డాక్టర్ శరత్ జ్యోత్స్న, అన్ని విభాగాల వైద్యులు, మెడికల్ కళాశాల అధ్యాపకులు, వైద్య, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.