కొత్తమ్మతల్లి ఆలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు
పకడ్బందీగా ఏర్పాట్లు
ప్రజాశక్తి – కోటబొమ్మాళి
కొత్తమ్మతల్లి ఉత్సవాలు అక్టోబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు మూడో తేదీతో ముగియనున్నాయి. ఏటా ఈ ఉత్సవాలు మహాలయ అమావాస్య తర్వాత వచ్చే గురువారం నాడు ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు జిల్లా, ఉత్తరాంధ్ర ప్రాంతవాసులే కాకుండా తెలంగాణ, ఒడిశా నుంచి యాత్రికులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ ఏడాది ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండగగా ప్రకటించడంతో అధికార యంత్రాంగం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయు డు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని శాఖల అధికారులు, స్థానిక టిడిపి నాయకుల పర్యవేక్షణలో గ్రామ పెద్దల సూచనలు, సహాయ సహకారాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ నిర్వహిస్తున్నారు.ఉత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లుమూడు రోజలు పాటు నిర్వహించే కొత్తమ్మతల్లి ఉత్సవాలు రాష్ట్రస్థాయి ఉత్సవాలుగా నిర్వహించాలని ప్రభుత్వం అదేశించడంతో ఈ ఏడాది భారీగా ఏర్పాట్లు చేశారు. కోటబొమ్మాళి మెయిన్ రోడ్డులో ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి రెండు కిలోమీటర్లు పొడవునా కొత్తపేట వరకు విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. లైటింగ్‌తో కూడిన వెంకటేశ్వర ఆలయం, కొత్తమ్మతల్లి ఆలయం వంటి భారీ కటౌట్లు చూపరులను ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు వచ్చే వారికి ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జెయింట్ వీల్, శాలంబో, బ్రేక్ డాన్స్, కారు, మోటార్ సైకిల్ విన్యాసాలు ఆకట్టు కునే విధంగా ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే యాత్రికులకు దేవస్థానం వారు ఉచిత ప్రసాదాల పంపిణీ, ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఆర్‌టిసి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. యాత్రికులకు వైద్యశాఖ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తోంది.సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాల సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ప్రావీణ్యం పోందిన కబడ్డీ, సంగిడీ రాళ్లు, ఈడ్పురాయి, ఉలవల బస్తాలు పోటీలు 1, 2, 3 తేదీల్లో నిర్వహిస్తారు. పగటి వేషాలు, కోయ నృత్యాలతో పాటు మూడు రోజుల రాత్రులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు జబర్దస్త్ టీమ్ సందడి చేయనుంది. భారీ బందోబస్తుమూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందో బస్తును ఏర్పాటు చేసింది. 450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఎవరైనా ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడినా 9440795835, 08942 238633 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.