శ్రీకాకుళం అర్బన్ : ధర్నా చేస్తున్న సిఐటియు, రైతుసంఘాల నాయకులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి డిమాండ్ చేశారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మిక హక్కులు పరిరక్షించాలని, ఆహార పంటలకు కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుతూ సిఐటియు, కార్మిక, రైతుసంఘాల ఆధ్వర్యాన బుధవారం నగరంలోని ఆర్‌అండ్‌బి రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వచ్చి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికవర్గం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కోవిడ్ కాలంలో దుర్మార్గంగా పార్లమెంట్‌లో, బయట ఎటువంటి చర్చ జరగకుండా లేబర్ కోడ్‌లను ఆమోదించిందన్నారు. మోడీ మూడో ప్రభుత్వంలో అమలు చేయడానికి సిద్ధంగా ఉందని, ఎప్పుడైనా అమలు ఉత్తర్వులు ఇస్తామని ఇటీవల ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వర్గానికి ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి హక్కులను కుదించడమే లేబర్ కోడ్‌ల ముఖ్య ఉద్దేశమన్నారు. కార్మిక హక్కులు కాలరాసి పెట్టుబడిదారులకు పెద్దపీట వేయడానికి లేబర్ కోడ్‌లు వచ్చాయని చెప్పారు. కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా పనిచేయించి దోపిడీని మరింత తీవ్రతరం చేయడానికి కేేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. కార్మికులను హైర్ అండ్ ఫైర్ పద్ధతిలో ఇష్టం వచ్చినట్లు తొలగించవచ్చని, ఫిక్స్‌డ్ టెర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో పర్మినెంట్ కార్మికులను నోటీసు ఇవ్వకుండా, తొలగింపు బెనిఫిట్స్ ఇవ్వకుండా తొలగించవచ్చన్నారు. కంపెనీల లేఆఫ్, లాకౌట్, మూసివేతలు 300 మంది లోపు ఉంటే ప్రభుత్వ అనుమతి అవసరం లేదని, దీనివల్ల 90 శాతం మంది కార్మికులు చట్టపరిధికి బయటకు వెళ్తారన్నా రు. కార్పొరేట్లు కోరుతున్నట్లు పనిగంటలు ఇష్టం వచ్చినట్లు పెంచవచ్చని చెప్పారు. అందుకే ఎల్ అండ్ టి యజమాని సుబ్రమణ్యం నేడున్న నెలకు 48 గంటల బదులు 90 గంటలు కార్మికులు పనిచేయా లని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. యజమానులు ఏ చట్టాల అమలును ఉల్లంఘించినా తనిఖీలు లేకుండా చేశారని తెలిపారు. అందువల్లే ప్రతిరోజు కార్మికులు పరిశ్రమల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. లేబర్ కోడ్‌ల వల్ల ప్రాణానికే భద్రత లేకుండా పోయిందని, యజమానులకు గతంలో ఉన్న జైలు శిక్షలు లేకుండా చేశారని చెప్పారు. పిఎఫ్, ఇఎస్‌ఐ, బోనస్, కనీస వేతనాలు అమలు వంటి ప్రాథమిక చట్టాల అమలుకు అధోగతి పట్టిందన్నారు. ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి నిధులు తగ్గించారని విమర్శించారు. ఉపాధి హామీకి సరిపడా నిధులు కేటాయించలేదన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎన్.వి రమణ, ఎ.సత్యనారాయణ, ఆర్.ప్రకాష్, కె.సూరయ్య, పి.గోపి, అంగన్వాడీ యూనియన్ నాయకులు కె.కళ్యాణి, రాజేశ్వరి, ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు డి.ధనలక్ష్మి, పి.జయలక్ష్మి, మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ బి.ఉత్తర, సుశీల, వి.లక్ష్మి, పలు యూనియన్ల నాయకులు డి.వాసుదేవరావు, టి.త్రినాథరావు, ఎల్.రామప్పడు, బి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.పలాస : స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సిఐటియు, ఎఐటియుసి, ఎఐసిసిటియు ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. ముందుగా పలాస జూనియర్ కళాశాల ప్రాంగణం నుంచి ఆర్‌డిఒ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా అనంతరం ఆర్‌డిఒ కార్యాలయ ఎఒకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, ఎస్.లక్ష్మీనారాయణ, ఎఐటియుసి నాయకులు సిహెచ్.వేణుగోపాల్, ఎఐసిసిటియు నాయకులు కె.కామేశ్వరరావు జీడి కార్మిక సంఘం నాయకులు సిహెచ్.జానకమ్మ, జి.బాలమ్మ, బి.చంద్రావతి, కుసుమ, రైతుసంఘం నాయకులు టి.అజరు కుమార్, జుత్తు సింహాచలం పాల్గొన్నారు.