కార్మిక చట్టాలను అమలు చేయాలి

మందస జీడి, రైస్‌మిల్లు కార్మికులకు

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు

సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు

ప్రజాశక్తి – మందస

మందస జీడి, రైస్‌మిల్లు కార్మికులకు కార్మిక చట్టాలను అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి డిమాండ్‌ చేశారు. మండలంలోని రైస్‌మిల్లు, జీడి పరిశ్రమల కార్మికుల సమావేశాన్ని సారంగిపురంలోని సిఐటియు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడి, రైస్‌మిల్లుల యాజమాన్యాలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయడం లేదని చెప్పారు. కార్మికులకు చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయకుండా తీవ్ర శ్రమ దోపిడీకి గురిచేస్తున్నాయని విమర్శించారు. గత వేతన ఒప్పందం ముగిసి ఆరు నెలలు దాటినా నూతన వేతన ఒప్పందం చేయలేదని చెప్పారు. జీడి, రైస్‌మిల్లుల యాజమాన్యాలు కార్మికులపై నిర్లక్ష్య వైఖరిని వీడి వెంటనే ఒప్పందం చేయాలని, కార్మికుల ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రైస్‌మిల్లు కార్మికులు బస్తాలు మోసినపుడు నడుం జారినా, యంత్రాల వద్ద ప్రమాదాలకు గురైనా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో కార్మికులకు ఎటువంటి ఆసరా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు చట్ట ప్రకారం పిఎఫ్‌, ఇఎస్‌ఐ, విడిఎ, బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్‌ కె.కేశవరావు, డి.లక్ష్మి, కె.ధనలక్ష్మి, బి.భారతి, జి.బాలమ్మ, కె.శాంతమ్మ, సిహెచ్‌.జానకమ్మ, కె.బాలకృష్ణ, బి.దుర్యోధన, పి.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️