కలెక్టర్‌కు వివరిస్తున్న భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు
- బిఆర్‌ఎయులో అక్రమాలపై ఫిర్యాదు’
- మీకోసం’కు 196 వినతులు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
ప్రభుత్వం నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని రద్దు చేయడంతో యజమానుల నుంచి సేకరించిన సెస్‌ను దారి మళ్లించారని, దీనివల్ల జిల్లాలో సుమారు లక్ష మందికి పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి నుంచి అందాల్సిన క్లయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎం.హరనాథ్, అధ్యక్షులు టి.హరినారాయణ, ఉపాధ్యక్షులు ఎ.కామేశ్వరరావులు కోరారు. జెడ్‌పిలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జెసి ఎం.నవీన్‌లు మీకోసం కార్యక్రమంలో సోమవారం వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు కలెక్టరేట్‌లో మాట్లాడుతూ సంక్షేమ చట్టం నిలుపుదలతో జిల్లాలో సుమారు లక్ష నిర్మాణ కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. దీంతో మృతి చెందిన కుటుంబాలకు, అంగవైకల్యం, వివాహం, ప్రసవం వంటి అవసరాలకు చెల్లించాల్సిన వేలాది క్లయిమ్‌లు గత నాలుగేళ్లుగా చెల్లించడం లేదని అన్నారు. చట్టప్రకారం, నిర్మాణ యజమానుల నుంచి నిర్మాణ విలువలో ఒక శాతం సెస్ వసూలు చేసి క్లయిమ్‌లు చెల్లింపునకు వినియోగించాల్సి ఉందన్నారు. ఖజానాపై పైసా కూడా భారం పడకుండా క్లయిమ్‌లు పరిష్కరించేందుకు వీలుందన్నారు. ఇప్పటికీ సెస్ వసూలు కొనసాగుతున్నా క్లయిమ్‌లను మాత్రం పరిష్కరించడం లేదని వివరించారు. వసూలైన సెస్‌ను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ‘నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం’ అమలు చేసి పెండింగ్ క్లయిమ్‌లను కార్మికులకు చెల్లించేందుకు ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. అలాగే అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని దళిత జెఎసి నాయకులు కె.రాంగోపాల్ కలెక్టర్‌కు వినతిపత్రం అంజేశారు.సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్మాణంలో ఉన్న రోడ్డు కోసం ప్రభుత్వం భూములను సేకరించిందని, అందులో టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో పలు లేఅవుట్ల మధ్య నుంచి రోడ్డు పడిందని బాధితులు కలెక్టర్ వివరించారు. అప్రూవుడ్ లేఅవుట్ కావడంతో ఇళ్ల స్థలాలుగా మారుస్తూ కన్వర్షన్ ఛార్జీలను, వివిధ రూపాల్లో పన్నులు చెల్లించామని అన్నారు. ఇప్పుడు ఆ స్థలాలను రోడ్డు నిర్మాణానికి తీసుకున్నారని అన్నారు. కానీ, వ్యవసాయ భూముల మాదిరిగానే పరిహారం చెల్లిస్తున్నారని వివరించారు. గతంలో అధిక ధర చెల్లించి ఇళ్ల స్థలాలకు కొనుగోలు చేశారని, ఇప్పుడు తక్కువ పరిహారం చెల్లించడం వల్ల రూ.లక్షల్లో నష్టపోతున్నామని అన్నారు. అపీల్ చేసుకునే అవకాశం కల్పించి అదనపు పరిహారం చెల్లించాలని బాధితులు వెంకటరమణ, జయలక్ష్మి తదితరులు విన్నవించుకున్నారు. జిల్లాలో వ్యక్తిగత సమస్యలతో పాటు భూవివాదాల పరిష్కారానికి 196 వినతులు వచ్చారు. జి.సిగడాం మండలం వెలగాడకు చెందిన పెట్టి ఆదిలక్ష్మి నడవలేని పరిస్థితిని కలెక్టర్ గమనించి ఆయనే ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు తన భూమిని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని, భూ సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేసింది. తక్షణమే ఈ సమస్య పరిష్కారంతో పాటు జాప్యానికి గల కారణాన్ని తెలపాలని జి.సిగడాం తహశీల్దార్‌ను ఆదేశించారు. కొత్తూరు మండలం ఆకులతంపరలో ప్రజా సౌకర్యార్థం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఏర్పాటు చేసిన తాగునీటి బోరుకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాళాలు వేసి ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, జిల్లా పరిషత్ సిఇఒ వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ రామ్మోహనరావు, హౌసింగ్ పీడీ నగేష్, డ్వామా పీడీ చిట్టిరాజు, డిఎంహెచ్‌ఒ డాక్టర్ మీనాక్షి, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ కళ్యాణ్‌బాబు, డిఇఒ వెంకటేశ్వరరావు, ఉద్యాన అథికారి వరప్రసాద్ పాల్గొన్నారు.