‘ఉపాధి’ చట్టంపై నేతల అక్కసు

మహాత్మాగాంధీ జాతీయ

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై రాజకీయ పార్టీల నాయకగణం ఎప్పటికప్పుడు తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. వైసిపి, టిడిపి నేతలు ఏదో ఒక సందర్భంలో వాటిపై వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కొందరు నేతలు బాధను గొంతులోనే దిగుమింగుతుండగా, మరికొందరు బయటకు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల జెడ్‌పి సర్వసభ్య సమావేశంలో ఎచ్చెర్ల ఎంపిపి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ నేతల ముసుగులో ఉన్న భూస్వాముల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. చెరువు గట్టుపై కూర్చొని కాలక్షేపం చేస్తున్న ఉపాధి కూలీలకు పనిచేయకుండానే డబ్బులు ఇచ్చేస్తున్నారంటూ తెగ బాధ పడిపోయారు. దీనివల్ల దేశవ్యాప్తంగా రూ.లక్షల కోట్లు వృథా అవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనుల వల్ల వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడూ తన మనసులోని మాటను బయటకు చెప్పేశారు. తామూ చాలా కాలంగా అదే చెప్తున్నామని, వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నా జరగడం లేదని, ఇప్పుడు ఉద్యాన పంటలకు ఉపాధి హామీని అనుసంధానం చేయడం కొంత ఉపశమనమని బదులిచ్చారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ సిఎంగా ఉన్న ధర్మాన కృష్ణదాస్‌ కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ వల్ల కూలీలంతా సోమరిపోతులుగా మారిపోతున్నారనేది అంతర్గతంగా అందరి నేతల మాటల్లోనూ కనిపిస్తోంది. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే సంపద సృష్టికి కూలీలే కారకులన్న కీలక అంశాన్ని నేతలు విస్మరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలోనూ వారి భాగస్వామ్యం ఉందనే వాస్తవాన్ని వారు గుర్తించినట్లు లేదు. ఉపాధి పనులు చేసినందుకు కూలీలకు 60 శాతం మేర డబ్బులు ఇస్తుంటే, మిగిలిన 40 శాతం డబ్బులను మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనుల కోసం వెచ్చిస్తున్నారు. వాటితోనే గ్రామాల్లో సిసి రోడ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాలు, చివరకు శ్మశానాలకు రహదారుల నిర్మాణం వంటి పనులు మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులతోనే చేపడుతున్నారు. ఈ పనులకు కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తోంది గ్రామస్థాయిలో ప్రధాన పార్టీ నాయకులే. కూలీలు పనిచేయడం ద్వారా పరోక్షంగా కాంట్రాక్టర్లూ ఆదాయం పొందుతున్నారన్న మాట. ఉపాధి పనులకు వెళ్లిపోవడం వల్ల వ్యవసాయ పనులకు కూలీలు రావడం లేదనేది రాజకీయ పార్టీల నేతలు చాలా కాలంగా బాధపడిపోతున్నారు. పోనీ వీరు ఏడాదంతా పనులు కల్పించగలరా అంటే అదీ లేదు. వ్యవసాయ సీజన్‌లో మాత్రమే పనులు ఇచ్చి, తర్వాత పొమ్మంటున్న పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. ఉపాధి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో కూలీలకు కొంతమేర ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది. గతంలో మాదిరి అప్పుల కోసం భూస్వాములపై ఆధారపడుతున్న పరిస్థితి అంతగా ఉండడం లేదు. కూలీలపై క్రమేణా తమ పెత్తనం పోతుందనే భయం భూస్వాముల్లో కనిపిస్తోంది. దీంతో పలురకాల వేదికల్లో రాజకీయ నాయకుల నుంచి ఉపాధి చట్టంపై ఈ తరహా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అధికారం తలకెక్కిందో, తమకు ఏది వచ్చినా పార్టీ పెద్దలు, ప్రభుత్వం చూసుకుంటుందన్న అపోహ ఏమో గానీ టిడిపికి చెందిన కొందరు నాయకులు ఇటీవల నోరు జారుతున్నారు. సంతబొమ్మాళి మండల టిడిపి అధ్యక్షుడు జీరు భీమారావు జిల్లా ఉన్నతాధికారులపై చేసిన పరుష వ్యాఖ్యలు అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సంతబొమ్మాళి చేపల కట్టు వేలం పాటకు సంబంధించి వివాదం సందర్భంగా కలెక్టర్‌, ఆర్‌డిఒ వీపు బద్దలు కొడతానంటూ నోటికొచ్చినట్లు మాట్లాడటం అందరినీ నివ్వెరపరిచింది. మూలపేట పోర్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ లాటరీ తీయడానికి వాడెవడు అంటూ ఆర్‌డిఒను దూషించడం బరితెగింపునకు నిదర్శనం. సంతబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌లో సిఐ, ఎస్‌ఐల సమక్షంలో రెచ్చిపోవడం అధికారం ఉందన్న అహంకారమే తప్ప మరొకటి కాదు. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదంటే రాజకీయ కారణాలు తప్ప మరొకటి కాదనేది తెలుస్తోంది. ఉన్నతాధికారులను అంతలా దూషించిన వ్యక్తి టిడిపి నాయకుడు కావడం, మంత్రి అచ్చెన్నాయుడు ప్రధాన అనుచరుడు కావడం తప్ప మరొకటి కాదనేది అందరికీ తెలిసిందే. తర్వాత ఏమైందో ఏమో గానీ మరుసటి రోజు తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్తే చేసిన తప్పు సమసిపోతుందంటే వైసిపి నేతలు కూడా గతంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌పై తాము చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చేప్పేందుకు సిద్ధంగానే ఉంటారు. మరి వారిని వదిలేస్తారా?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నాయకులపై రాష్ట్రంలోని మారుమూల ప్రాంత పోలీస్‌స్టేషన్లలో సైతం కేసులు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా తిప్పుతున్న పరిస్థితిని చూస్తున్నాం. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం తన పని తాను చేసుకువెళ్లిపోతుందంటూ యధాలాపంగా స్టేట్‌మెంట్లు ఇచ్చే ప్రభుత్వ పెద్దలు, ఈ విషయంలో సొంత పార్టీ నేతల జోలికి వెళ్లకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. జిల్లా మెజిస్ట్రేట్‌, ఆర్‌డిఒపై టిడిపి మండల నాయకుడు అంతలా విరుచుకుపడితే మండల స్థాయిలో పనిచేసే తహశీల్దారు, ఎంపిడిఒ ఇతర ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?. వారు స్వేచ్ఛగా ఏం పని చేయగలరు?. రెండు వేల మందితో వస్తాం… లెక్కలు చెప్పకపోతే చంపేస్తామంటూ సిఐ, ఎస్‌ఐలను పోలీస్‌స్టేషన్‌లో హెచ్చరించినా వారు చేష్టలుడిగి చూడడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయతా?, లేదా అధికార పార్టీ నాయకుడి జోలికి వెళ్లకూడదనుకున్నారా?. కూటమి నేతల ఆగడాలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. పోలీసులు ఇప్పటికైనా నిష్క్రియాపరత్వాన్ని వీడి చర్యలు చేపట్టాల్సి ఉంది. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు సహా ఇతర కూటమి ప్రజాప్రతినిధులు ఇటువంటి తరహా ఘటనలను ఉపేక్షించకూడదు. తమ పార్టీ నాయకుడు, కార్యకర్త అని వదిలేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం లేకపోలేదు. అధికారులు, ఉద్యోగులపై దూషణలు, దాడులకు పాల్పడితే అది వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతిసే అవకాశం ఉంది. ఇది పాలనపై ప్రభావం చూపుతుంది. అంతిమంగా కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుంది.

➡️