సిలబస్‌ మార్పుతో విద్యార్థులకు నష్టం

పదో తరగతి విద్యార్థులకు

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు

  • యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

పదో తరగతి విద్యార్థులకు మారిన సిలబస్‌లో ఉన్న కంటెంట్‌, పాఠాలు భవిష్యత్‌లో విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేవని, దీనివల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియను తెలుసుకునేందుకు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మారిన పదో తరగతి సోషల్‌ పాఠ్య పుస్తకంలో 258 పేజీలు ఉంటే 167 పేజీలు యూరోపియన్‌ చరిత్రకు కేటాయించి, రాష్ట్ర చరిత్రకు అత్యంత తక్కువ పేజీలు ఇవ్వడం విద్యార్థులకు ఎలా ఉపయోగమో చెప్పాలన్నారు. గతేడాది తొమ్మిదో తరగతి హిందీ పుస్తకం చాలా ఇబ్బందికరంగా ఉందని, ఉపాధ్యాయులూ అర్థం చేసుకోలేని ఉత్తర భారతదేశం మాండలికాలు ప్రవేశపెట్టడం వల్ల గందరగోళంగా ఉందన్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఈ ఏడాదీ అదే పద్ధతిలో ముద్రించడం విద్యార్థులకు హిందీ భాషపై ఆసక్తిని తగ్గించే ప్రక్రియలో భాగంగానే భావించాల్సి వస్తోందని చెప్పారు. భౌతికశాస్త్రంలో మూలకాల వర్గీకరణ, పరమాణు నిర్మాణం, రసాయన బంధం వంటి పాఠాలు తొలగించడం దారుణమన్నారు. పిల్లలకు శాస్త్రీయమైన దృక్పథాన్ని అలవర్చే పాఠ్యాంశాలను తీసివేయడం సరికాదన్నారు. గణిత సబ్జెక్టులో భవిష్యత్‌ పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా లేవని తెలిపారు. ఇప్పటికైనా పాత పాఠ్యాంశాలను తిరిగి చేర్చాలని, పిల్లల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపుదల కోసం ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించే పాఠ్యాంశాలను తొలగించడం సరికాదన్నారు.యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. ఇందుకు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, ఏకపక్ష విధానాలు ఒక కారణం కాగా, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే స్పందించి 117 జిఒను రద్దు చేయడం, సమాంతర మీడియాలను కొనసాగించడం, ప్రాథమిక పాఠశాల కొనసాగింపుపై తక్షణ ప్రకటన చేయకపోవడం మరో కారణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ విద్యను కాపాడుకునే చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ జిల్లాలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం ఉపాధ్యాయులు అవసరమైతే గంట సమయాన్ని అదనంగా కేటాయించాలని కోరారు. విద్యార్థులందరికీ చదవడం, రాయడం నేర్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు కె.దాలయ్య, జిల్లా కార్యదర్శి వై.వాసుదేవరావు పాల్గొన్నారు.

➡️