నినాదాలు చేస్తున్న ఎండిఎం కార్మికులు
ఇచ్ఛాపురం:
మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ అక్టోబరు రెండో తేదీన విజయవాడలో నిర్వహించే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎ.మహాలక్ష్మి పిలుపునిచ్చారు. ఇచ్ఛాపురం హైస్కూల్ ఆవరణలో సంఘ మండల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వంట కార్మికులపై వేధింపులు, తొలగింపులు పెరిగాయన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కార్మికులపై వేధింపులకు పాల్పడుతోందని చెప్పారు. 24 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు నిర్దాక్షిణ్యంగా రాజకీయ కారణాలతో తొలగిస్తున్నారని విమర్శించారు. మానసికంగా వేధిస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఈ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50వేల మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో ఎక్కువగా ఒంటరి మహిళలే ఉన్నారని చెప్పారు. వీరి ఉపాధికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మరోవైపు పనిలో అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నా ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం లేదన్నారు. అనేక పాఠశాలల్లో ప్రథమ చికిత్స కిట్లు కూడా లేవని చెప్పారు. పథకం అమలుకు పాఠశాలలో పిల్లలకు ఇస్తున్న మెనూ ఛార్జీలకు సంబంధం లేకుండా రోజుకో ఐటమ్‌తో గత ప్రభుత్వ మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని, ప్రతి నెలా ఐదో తేదీ లోపు వేతనాలు, బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు అనుగణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. ప్రభుత్వమే గ్యాస్‌ను సరఫరా చేయాలని, ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పథకం అమలుకు కనీస మౌలిక సదుపాయాలైన వంట షెడ్లు మంచినీరు తదితర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. సదస్సులో వంట కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాటాలకు సన్నద్ధం కానున్నట్లు చెప్పారు. సమావేశంలో యూనియన్ నాయకులు డి.జమ్మాలు, బి.పార్వతి, ముత్యాలు, హేమలత, లకీëబెహరాపాల్గొన్నారు.