పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటుతున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి
- ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి
ప్రజాశక్తి – పొందూరు
నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పొందూరు పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ ఆవరణ, రిసెప్షన్, లాకప్, కంప్యూటర్, రైటర్ గదులను పరిశీలించారు. పలురకాల రికార్డులను పరిశీలించి, సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్‌లో ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళల భద్రత కోసం, మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా పోలీసులకు నేర నియంత్రణపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజూ గ్రామాలను సందర్శించి, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత, కొత్త నేరస్తులపై నిఘా ఉంచాలని.. మహిళలు, చిన్న పిల్లలపై నేరాలను కట్టడి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ నిర్వహించి ప్రమాదాలను నివారించాలన్నారు. ప్రతిరోజూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్వారీల్లో సమయపాలన లేకుండా పేలుళ్లపై ఎస్‌పి దృష్టికి పలువురు తీసుకెళ్లగా, నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్‌ఐ సత్యనారాయణను ఆదేశించారు. దొంగతనాలు, ప్రాపర్టీ నేరాల దర్యాప్తు పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని, ఫిర్యాదుదారులు, బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. కార్యక్రమంలో డిఎస్‌పి సిహెచ్.వివేకానంద, ఆమదాలవలస సిఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది ఉన్నారు.