ఎమ్మెల్యే గొండు శంకర్‌

నడక, వ్యాయామం, యోగా వంటి వాటి ద్వారా

ప్రతిజ్ఞ చేస్తున్న ఎమ్మెల్యే శంకర్‌ తదితరులు

శ్రీకాకుళం అర్బన్‌:

నడక, వ్యాయామం, యోగా వంటి వాటి ద్వారా హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా జెమ్స్‌ ఆస్పత్రి, రోటరీ క్లబ్‌ ఆధ్వర్యాన ఆదివారం ప్రభుత్వ పురుష డిగ్రీ కళాశాల వద్ద సమావేశ అనంతరం అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాంత్రిక జీవనం, మానసిక ఒత్తిడి, కనీస వ్యాయామం లేకపోవడం, దురలవాట్లు, ఆహార నియమాలు పాటించకపోవడం గుండె లయ తప్పేలా చేస్తున్నాయని తెలిపారు. చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలతో ఆస్పత్రిపాలవుతున్నారని చెప్పారు. అప్పటివరకు ఉత్సాహంగా తిరుగుతూ ఉండే యువత కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందుతున్న ఘటనలు తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు. కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని తెలిపారు. ఉదయాన్నే నడక, చిన్నపాటి వ్యాయామాలు చేస్తే గుండెకు ఎంతో మంచిదన్నారు. వ్యాయామంతో పాటు మంచి ఆహారపు అలవాట్లతో గుండె జబ్బులకు చెక్‌ పెట్టవచ్చని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారని వివరించారు. ఎక్కువ కాలం నుంచి షుగర్‌ ఉన్న వాళ్లు, ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులు ఉన్న వాళ్లు, అధిక కొలెస్ట్రాల్‌, హైపర్టెన్షన్‌ ఉన్న వాళ్లు ఏడాదికి, రెండేళ్లకు గుండెకు సంబంధించిన పరీక్షలు ముందస్తుగా చేయించుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తే హృదోగాలకు దూరంగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మిగిలిన వాళ్లు కూడా 40 ఏళ్ల వయసు నుంచి ముందస్తుగా గుండె పరీక్షలు చేయించుకుని గుండె జబ్బులను గుర్తిస్తే సకాలంలో వైద్య సేవలు పొంది రక్షణ పొందవ చ్చని సూచించారు. హృదయ ఆరోగ్యానికి మూలస్తంభం అని సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనడం, పొగాకు వాడకాన్ని నివారించడం, మద్యపానాన్ని పరిమితం చేయడం వంటి సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా గుండె జబ్బులను చాలావరకు నివారించ వచ్చని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ లక్ష్మీలలిత, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హేమంత్‌, లయన్స్‌ క్లబ్‌ శ్రీకాకుళం హర్షవల్లి అధ్యక్షులు వి.జగన్నాథనాయుడు, రోటరీ క్లబ్‌ అధ్యక్షులు ముని శ్రీనివాసరావు, జెమ్స్‌ కార్డియోలజిస్టులు పాల్గొన్నారు.

 

➡️