ఎమ్మెల్యేల విన్నపాలు ఫలించేనా?

శాసనసభా సమావేశాల ప్రశ్నోత్తరాలు, ఆ తర్వాత ప్రత్యేకంగా

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

శాసనసభా సమావేశాల ప్రశ్నోత్తరాలు, ఆ తర్వాత ప్రత్యేకంగా కొంతమంది ఉన్నతాధికారుల ను కలిసి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించడం స్వాగతించదగ్గ విషయమే. అసెంబ్లీకి వెళ్లి ఊరకనే కూర్చొని రాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడడం హర్షనీయం. అయితే వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతవరకు నెరవేరుస్తారన్నది ప్రశ్నార్థకమే. జిల్లాకు చంద్రబాబు ఇచ్చిన హామీలే నెరవేరని నేపథ్యంలో ఎమ్మెల్యేలు లెవనెత్తిన సమస్యలకు, వినతిపత్రాలకు ఏమేరకు ప్రాధాన్యం ఇస్తారో చూడాల్సిందే. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మెళియాపుట్టి మండలంలో ఐటిడిఎ ఏర్పాటు చేయాలంటూ ప్రశ్నోత్తరాల సమయంలో అడగడం మంచి విషయమే. 2022లో జిల్లాల పునర్విభజన తర్వాత సీతంపేట ఐటిడిఎ పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లిపోవడంతో శ్రీకాకుళంకు ఐటిడిఎ లేకుండా పోయింది. నాలుగైదేళ్లుగా గిరిజనులకు కష్టాలను తప్పడం లేదు. ఐటిడిఎకు సంబంధించి నిర్ణయాలు అమలు చేసే వ్యవస్థ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండటంతో ఇక్కడి గిరిజనులకు తలెత్తిన ఏ సమస్యనూ జిల్లా కలెక్టర్‌ పరిష్కరించే పరిస్థితి ఉండడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలోనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గిరిజన గ్రామాల్లో ఐటిడిఎ పిఒలు సందర్శిస్తున్నా, పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఇదే జిల్లాలో ఉన్న గిరిజన గ్రామాలను జిల్లా కలెక్టర్‌ సందర్శించినా గిరిజనుల వినతులను అక్కడకే పంపాల్సి ఉంటుంది తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడంతో సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు ఎమ్మెల్యే గోవిందరావు ఈ సమస్యను ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లయింది. ఎన్నికల ప్రచారం కోసం పాతపట్నం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఐటిడిఎ ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీని మరోసారి సిఎంకు గుర్తు చేసినట్లయింది. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా ప్రభుత్వపరంగా అటువంటి ప్రయత్నమేదీ జరిగినట్లు కనిపించలేదు. పరిశ్రమలకు ఆఘమేఘాల మీద భూములు కేటాయింపు, అనుమతులు జారీ చేస్తున్న ప్రభుత్వం గిరిజనుల విషయంలో మాటల్లో ఉన్న ప్రేమ చేతల్లో కనిపించడం లేదు.జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రస్తావించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం పలాస వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైనా స్పష్టమైన హామీనిచ్చారు. జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామంటూ వాగ్ధానం చేశారు. జీడి రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా?, ఇతర వాగ్ధానాల మాదిరిగా చాప చుట్టేస్తారా? అన్నది చూడాల్సి ఉంది. జీడిపిక్కల కొనుగోలుపై గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేదు. జీడిపిక్కలను కొనుగోలు చేసే ఉద్దేశమే ఉంటే బడ్జెట్‌లో అందుకు సరిపడా నిధులను కేటాయించి, ఆ మేరకు ప్రస్తావించి ఉండేది. ఇప్పటికే జీడి పిక్కల కొనుగోలు సీజన్‌ మొదలవ్వడంతో గ్రామాల్లోకి దళారులు ప్రవేశించి తక్కువ రేటుకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.శ్రీకాకుళం నియోజకవర్గంలో వర్షాకాలంలో వరద ముంపు సమస్యలపై ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ను కలిసి పి.జి పేట, కళింగపట్నం నాగావళి నది ప్రాంతంలో కరకట్టలు నిర్మించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లోని అన్ని నియోజకవర్గాల్లో కరకట్టల సమస్య ఉన్నా, తన నియోజకవర్గం మేరకు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం మంచి పరిణామమే. అయితే ఇది ఎంతవరకు నెరవేరుతుందనేది సందేహమే. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విపత్తులు సంభవించకుండా, వచ్చే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవడం వంటి విధులను మాత్రమే నిర్వర్తిస్తుంది. కరకట్టల విషయాన్ని ప్రభుత్వమే చూడాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి సిఫార్సు చేసినా బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా సాధ్యమయ్యే ఆస్కారం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో కరకట్టల ప్రస్తావనే లేని విషయాన్ని చూశాం.వంశధార ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టాలంటూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించడం ఇతర ఎమ్మెల్యేలెవరూ పట్టించుకోని ఓ సమస్యను లేవనెత్తడం హర్షించదగ్గ విషయమే. హిరమండలం మండలం గొట్టాబ్యారేజీ నుంచి నీటిని విడిచిపెడుతున్న ఎడమ వైపు కాలువ పరిస్థితి దయనీయంగా మారింది. ఎడమ కాలువ నుంచి 2,480 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టే అవకాశం ఉన్నా, బ్యారేజీలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న రోజుల్లోనూ 1800 క్యూసెక్కులకు మించి విడిచిపెట్టలేని పరిస్థితి నెలకొంది. కాలువల నిర్వహణ లేకపోవడం, గట్లు బలహీనంగా ఉండడంతో అంతకుమించి నీటిని వదిలిన సందర్భంలో గండి పడిన ఘటనలూ లేకపోలేదు. 2014-19 టిడిపి హయాం నుంచి ఎడమ కాలువ ఆధునికీకరణ పనులపై అధికారులు ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. పదేళ్లు గడుస్తున్నా ఆధునికీకరణకు నోచుకోని పరిస్థితిని చూస్తున్నాం. గత నెలలో టిడిపి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల జాబితాలో వంశధార ఆధునికీకరణ పనులకు డబ్బులే కేటాయించలేదు. ఎమ్మెల్యే వినతిపత్రంతో పనులు జరుగుతాయంటే అది గొప్ప విజయమే అవుతుంది. ఎమ్మెల్యేల వరకు తమ పని తాము చేశారు. ఇక బాబు వారి మాటకు ఎంతమేర గౌరవిస్తారో వేచి చూడాల్సిందే!.

➡️