కేసు వివరాలను వెల్లడిస్తున్న డిఎస్‌పి వివేకానంద
వివాహేతర సంబంధమే కారణం
పది మంది అరెస్టు
డిఎస్‌పి సిహెచ్.వివేకానంద
ప్రజాశక్తి – ఆమదాలవలస
మండలంలోని బొబ్బిలిపేటకు చెందిన గురుగుబెల్లి చంద్రయ్య హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో భార్యే ప్రియుడితో హత్య చేయించినట్లు డిఎస్‌పి సిహెచ్.వివేకానంద తెలిపారు. ఈ ఘటనలో పది మందిని అరెస్టు చేశామని, ఇందులో ఒకరు మైనర్ అని చెప్పారు. ఈ హత్యలో ఎటువంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. స్థానిక సిఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. బొబ్బిలిపేటకు చెందిన చంద్రయ్య భార్య ఈశ్వరమ్మకు అదే గ్రామానికి చెందిన చింతాడ బాలమురళీకృష్ణతో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. విషయాన్ని తెలుసుకున్న చంద్రయ్య భార్యను మందలించి, సెల్‌ఫోన్ వాడకుండా చేయడంతో పాటు బాలమురళీకృష్ణతో ఉన్న ఆర్థిక లావాదేవీలనూ నిలిపివేశాడు. చంద్రయ్యకు తెలీకుండా వేరే ఫోన్‌తో ఈశ్వరమ్మ, బాలమురళీకృష్ణ మాట్లాడుకునేవారు. చంద్రయ్యను అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో బాలమురళీకృష్ణ తన సోదరుడైన మండలంలోని శ్రీనివాసాచార్యులపేటకు చెందిన గురుగుబెల్లి అరవింద్ సహకారం కోరాడు. అరవింద్ తనకు తెలిసిన బూర్జ మండలం ఉప్పినివలసకు చెందిన వంశీ, గణేష్‌ను పరిచయం చేశాడు. వారితో పాటు అదే గ్రామానికి చెందిన చరణ్ తేజ్, ప్రవీణ్, బొమ్మాలి శ్రీవర్థన్, బొమ్మాలి ఉమామహేశ్వరరావు, ఈసర్లపేటకు చెందిన యర్లంకి కృష్ణ బొబ్బిలిపేట గ్రామ సమీపంలోని చెరువు వద్ద గత నెల 25న మాటు వేశారు. చంద్రయ్య తన కుమార్తెను ఇంటికి తీసుకొచ్చేందుకు ఆమదాలవలస బయలుదేరినట్లు ఈశ్వరమ్మ బాలమురళీకృష్ణకు ఫోన్ చేసి చెప్పింది. గ్రామ శివారులో చెరువు వద్ద చంద్రయ్యను అటకాయించి బీరు సీసాతో బలంగా తలపై కొట్టడంతో, వాహనం అదుపు తప్పి మృతుడు కింద పడిపోయాడు. బీరు సీసాలు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువులోకి ఈడ్చుకెళ్లి తుప్పల చాటున పడేశారు. అదే రాత్రి ఈశ్వరమ్మ భర్త కనిపించడం లేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సిఐ పి.సత్యనారాయణ, ఎస్‌ఐ ఎస్.బాలరాజు ఘటనాస్థలికి దర్యాప్తు చేపట్టారు. హత్య కేసులో ప్రమేయమున్న పది మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, 14 రోజులు రిమాండ్ విధించారు.