ఎలాంటి ప్రచారానికైనా అనుమతి తప్పని

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

* సరిజిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌ హాలులో 40వ వారపు సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక్‌సభ వరకూ జిల్లా ఎన్నికల అధికారి, అసెంబ్లీ నియోజవర్గాలకు సంబంధించి అక్కడి ఆర్‌ఒలు అనుమతులు ఇస్తారని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఇతర నిబంధనలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రచార అనుమతులకు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా అనుమతులు ఇస్తామని అన్నారు. వివరాలన్నీ సక్రమంగా ఉంటే 24 గంటల్లో కూడా అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. సువిధ యాప్‌లో, ప్రత్యక్షంగా పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్‌లోని కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన సింగిల్‌ విండో విభాగంలో, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో పార్టీల ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అన్నిరకాల అంశాలకు ఒకేసారి దరఖాస్తు చేసుకొంటే అనుమతుల జారీ ప్రక్రియ సులువవుతుందని చెప్పారు. ఇప్పటివరకు 150కి పైగా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేశామన్నారు. 14లోగా ఓటు నమోదుకు చివరి అవకాశం2024, ఏప్రిల్‌ 14వ తేదీ వరకు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం-6 సమర్పించవచ్చని సూచించారు. 2024, ఏప్రిల్‌ 2 ముందు తేదీ నాటికి వచ్చిన అన్ని రకాల దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు చేపట్టామని చెప్పారు. అన్ని రకాల చేర్పులు, మార్పులు చేశాక జిల్లాలో ఓటర్ల సంఖ్య 18,66,030గా నమోదైందని వివరించారు. ఇప్పటి వరకు 2,55,633 మందికి కొత్త ఎపిక్‌ కార్డులు పోస్టల్‌ ద్వారా అందజేశామని చెప్పారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్ట అమలుకు బృందాలు పనిచేస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు జిల్లాలో వివిధ రకాల ఘటనల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని చెప్పారు. సి-విజిల్‌ బృందాలు ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లోనే 95 శాతం ఫిర్యాదులు పరిష్కరించారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ బూత్‌ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. తద్వారా ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు. సామాజిక ఫించన్లను ఈ నెల 6లోగా పంపిణీ చేస్తామని, పంపిణీ కోసం ఎక్కడా వాలంటీర్లను వినియోగించడం లేదని, సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తున్నారని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, రట్టి ప్రకాశరావు (సిపిఎం), రౌతు శంకరరావు (వైసిపి), కె.వి.రామరాజు (టిడిపి), బోకర నారాయణరావు (బిఎస్‌పి), దేశళ్ల గోవింద మల్లిబాబు (కాంగ్రెస్‌) పాల్గొన్నారు.

➡️