మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు
- ప్రతి నిర్వాసితునికీ న్యాయం చేస్తాం
- రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి – పలాస
సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కీలకమైన ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, జిల్లా అభివృద్ధికి మరింత ఊతమిస్తుందన్నారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని పలాస, పాతపట్నం ఎమ్మెల్యేలు గౌతు శిరీష, మామిడి గోవిందరావుతో కలిసి శనివారం సందర్శించి, అధికారులతో సమీక్షించారు. నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం, రేగులపాడు వద్ద రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న 2,481 ఎకరాల్లో నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి నష్టపరిహారం అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ పరిధిలోకి వచ్చిన గ్రామాల్లో ప్యాకేజీ మంజూరు కాలేకపోయిన 130 మందికి త్వరలో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల స్థలాల్లేని 11 మందికి త్వరలో పట్టాలు అందజేయనున్నట్టు తెలిపారు.గ్రామస్తులు వెలిబుచ్చిన సమస్యలపై స్పందించిన మంత్రి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. సవర చీపురుపల్లిలోని 14 ఎకరాలకు సంబంధించిన పరిహారం, డబుల్ పేమెంట్లు, డి-పట్టాలకు సంబంధించి చెల్లింపులపై సమీక్ష నిర్వహించి తక్షణ నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దేవాలయ భూములకూ పరిహారం విషయాన్ని పరిశీలిస్తామని హామీనిచ్చారు. ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించిన మంత్రి, వచ్చే మూడు నెలల్లో ఏడున్నర లక్షల మీటర్లు, ఏడాదిలో 17 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిల్లుల క్లియరెన్స్ విషయమై స్వయంగా బాధ్యత తీసుకుంటానన్నారు.ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో మౌలిక వసతులురేగులపాడు గ్రామస్తులు ఆర్ అండ్ ఆర్ కాలనీలో మౌలిక వసతుల కొరతను ప్రస్తావించగా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందిస్తూ రెండు, మూడు నెలల్లో అన్ని వసతులు అందుబాటులోకి తెస్తామని హామీనిచ్చారు. ఇళ్ల పట్టాల కోసం అప్పట్లో విధించిన 5 లక్షల నిబంధన వల్ల దరఖాస్తు చేయలేని వారిని గుర్తించి, వారికి స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిర్వాసిత గ్రామాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తామని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి నిర్వాసితులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి, పలాస ఆర్‌డిఒలు కృష్ణమూర్తి, వెంకటేష్, పలువురు ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.