ఒపి ధర… గుండె దడ

జిల్లాలో సుమారు 180 ప్రైవేటు ఆసుపత్రులు

ఒక ఆసుపత్రిలో వేచి చూస్తున్న రోగులు, కుటుంబసభ్యులు

ఇష్టానుసారంగా పెంచుకుపోతున్న టోకెన్‌ ధరలు

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రూ.500 నుంచి రూ.600 వరకు ఫీజు

పలు రకాల పరీక్షల పేరుతో అధిక రుసముల వసూలు

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒపి ధరలను యేటికేడు పెంచేస్తున్నారు. ప్రజల్లో తమకున్న డిమాండ్‌ను అవకాశంగా తీసుకుని ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి. ఒపి ధర వింటేనే గుండె దడ పుట్టేలా కొన్నిచోట్ల ఫీజులు ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఏకంగా రూ.650 వసూలు చేస్తున్నారంటే, వారి దందా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక రోగి డాక్టర్‌ను కలిసిన తర్వాత జేబులు ఖాళీ అవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. చాలా ఆస్పత్రుల్లో అవసరం ఉన్నా, లేకున్నా రకరకాల పరీక్షలకు సిఫార్సు చేసి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు.ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, అరసవల్లిజిల్లాలో సుమారు 180 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోనే వందకు పైగా ఆసుపత్రులు ఉన్నాయి. వైద్య పర్యవేక్షణ బాగుంటుందనో, అన్ని సౌకర్యాలు ఉంటాయనో వంటి కారణాలతో ఎక్కువ మంది రోగులు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటికి గిరాకీ పెరుగుతోంది. మంచి పేరున్న ఆసుపత్రులైతే వేరే చెప్పనక్కర్లేదు. ఆ నోటా ఈ నోటా ఆ ఆసుపత్రిలో బాగుంటుందని తెలియడంతో రోగులు, వారి బంధువులు అంతా అక్కడకే పరుగులు తీస్తున్నారు. తమ వారి ప్రాణాలను కాపాడుకోవాలనే ఆందోళనతో అప్పులు చేసి ఎంత డబ్బులైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇష్టానుసారంగా ఒపి రేట్లను పెంచేస్తున్నాయి. ఒకప్పుడు రూ.200 మాత్రమే ఉండే ఒపి ధర ఇప్పుడు ఎక్కువ ఆస్పత్రుల్లో రూ.400 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తున్నాయి. శ్రీకాకుళం నగరం ఇల్లీసుపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రూ.600 వసూలు చేస్తున్నారు. ఒపి ఫైల్‌ కోసం అదనంగా మరో రూ.50 వసూలు చేస్తున్నారు. డే అండ్‌ నైట్‌ కూడలిలోని దాదాపు అన్ని ఆస్పత్రులు రూ.400 పైబడి వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్‌ ఆసుపత్రులన్నింటిలోనూ రూ.500 ఉన్నాయి.ఒక్కసారికే టోకెన్‌ చెల్లుబాటుఒపి ధరల అమల్లో వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణ కొరవడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఒపి టోకెన్‌ ధర కాలపరిమితి 15 రోజుల వరకు ఉండేది. మందులు అప్పటివరకు రాసి వాడమనేవారు. 15 రోజుల్లో రెండోసారి వెళ్లినా ఒపి వసూలు చేసే వారు కాదు. ఇప్పుడు వారం రోజుల కాలపరిమితికి మాత్రమే టోకెన్‌ అందిస్తున్నారు. పది రోజులకు తగ్గట్టు మందులు అందించి వాటిని వాడిన తర్వాత మళ్లీ రావాలని సూచిస్తున్నారు. దీంతో ఆ టోకెన్‌ చెల్లుబాటు కావడం లేదు. మళ్లీ డబ్బులు కట్టి టోకెన్‌ పొందాల్సి వస్తోంది.అనుబంధంగా ల్యాబ్‌లు, మందుల షాపులుప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా ల్యాబ్‌లు, మందులు షాపులు నడుపుతున్నారు. బయట ల్యాబ్‌ల్లో వైద్య పరీక్షలకు తక్కువ ధర ఉంటే, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు. వైద్యుడు సూచించడంతో తప్పనిసరిగా అక్కడే చేయించుకుంటూ అధిక ధరలను చెల్లిస్తున్నారు. అదీ అవసరమున్నా, లేకున్నా అన్ని పరీక్షలు చేయిస్తున్నారంటూ రోగులు వాపోతున్నారు. ఆసుపత్రుల ప్రాంగణంలోనే మందుల దుకాణాలను నడుపుతున్నారు. బయట దుకాణాల్లో కనీసం పది శాతం డిస్కౌంట్‌ ఇస్తుండగా, ఇక్కడ రూపాయి కూడా తగ్గించడం లేదు. తమ వద్ద డబ్బలు లేవని ఐదేసి చొప్పున మాత్రలు ఇవ్వాలని రోగులు బతిమిలాడుకున్నా, స్ట్రిప్‌ తీసుకోవాల్సిందేనని బదులిస్తున్న పరిస్థితి చాలా ఆస్పత్రుల్లో నెలకొంది. ఆసుపత్రిలో చేరితే అప్పులపాలే…ఒపి ధరలు ఇలా ఉంటే, ఆసుపత్రిలో అడ్మిట్‌ అయిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోగుల నుంచి రకరకాల పేర్లతో అడ్డగోలుగా డబ్బులను వసూలు చేస్తున్నాయి. ఆసుపత్రిలో చేరిన రోగి కోలుకునే వరకు అతని బాధ్యతను సంబంధిత వైద్యుడే చూసుకోవాల్సి ఉండగా, రౌండ్ల పేరుతో రూ.500 వసూలు చేస్తున్నారు. ఇవి కాకుండా డ్యూటీ డాక్టర్‌ ఫీజు అని, నర్సింగ్‌ ఛార్జీలు ఇలా రకరకాల పేర్లతో డబ్బులను గుంజుతున్నారు. ఐసియులో చేరిన రోగి బంధువుల పరిస్థితి అయితే వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కో ఆసుపత్రిలో ఐసియు ఛార్జీలను రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. 24 గంటలకోసారి రోగి బంధువులతో అడ్వాన్స్‌గా డబ్బులు కట్టించుకుని, ఆ తర్వాత చాంతాడులా ఫీజుల జాబితాను రోగి బంధువుల చేతిలో పెడుతున్నారు. రోగికి ఐసియు వార్డులో ఉంచాల్సిన అవసరం లేకున్నా, కొన్ని ఆసుపత్రులు అధిక సొమ్ముల కోసం అదనపు రోజులు అందులోనే ఉంచుతున్న పరిస్థితి నెలకొంది.ఒపి ధరలపై దృష్టిసారిస్తాంప్రైవేటు ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. ముఖ్యంగా యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఒపి, ఇతర ధరలను పరిశీలిస్తాం. ధరల నియంత్రణకు చర్యలు చేపడతాం. పలురకాల సేవలకు సంబంధిం చిన రేట్ల పట్టికను ఆసుపత్రుల్లో కచ్చితంగా ప్రదర్శించాలి. లేకుంటే చర్యలు తప్పవు. – డాక్టర్‌ కె.అనిత, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి

 

➡️