ఆపరేషన్‌ ‘కగార్‌’ ప్రజలపైనే యుద్ధం

కేంద్ర ప్రభుత్వం 17 నెలల క్రితం

సమావేశంలో మాట్లాడుతున్న సత్యనారాయణ

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ

ప్రజాశక్తి- పలాస

కేంద్ర ప్రభుత్వం 17 నెలల క్రితం తీసుకొచ్చిన ఆపరేషన్‌ కగార్‌ నేరుగా ప్రజలపైన, ప్రజల కోసం పోరాడే నేతలపైన, ఉద్యమకారులపైన యుద్ధమని అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణ అన్నారు. కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు కళ్యాణ మండపంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అధ్యక్షతన ఆపరేషన్‌ కగారుపై గురువారం నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని వనరులను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టడమే కర్తవ్యంగా పెట్టుకుందన్నారు. ప్రజల మనుగడను పట్టించుకోవడంలేదని ఆపరేషన్‌ కగారు అంతిమ యుద్ధంగా పెట్టుకుందని బిజెపిని విమర్శించారు. గతంలో సల్వర్‌ జూడుం, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌, ప్రస్తుతం ఆపరేషన్‌ కగారు ప్రకటించి నేరుగా ప్రజలపై ప్రత్యక్ష యుద్ధానికి దిగిందన్నారు. ఆదివాసీలు ఇప్పటికీ దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ డోలీల్లో పురుడు పోసుకునే స్థితిలో ఉందన్నారు. రంపచోడవరం నుంచి రాజమండ్రి వరకు గిరిజన ప్రాంతాలు మీదుగా నాలుగు నుంచి ఆరు వరసల రోడ్లు వేస్తామని ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. ఈ రవాణా ఆదివాసీల కోసం కాదని, విలువైన ప్రకృతి సంపదను కార్పొరేట్‌ సంస్థలకు ధారాధత్తం చేయడానికని విమర్శించారు. గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగిన ఎపి స్పీకర్‌ చట్టాలను చేయవలసింది పోయి రాజ్యానికి వ్యతిరేకంగా, చట్టవిరుద్ధంగా మాట్లాడటం ఏమిటని నిలదీశారు. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అభివృద్ధి, స్వేచ్ఛ కల్పించకుండా చేయడం ఇదెక్కడి ప్రజాస్వామ్య మని ప్రశ్నించారు. శ్రీకాకుళం ఉద్యమం ద్వారానే వన్‌ ఆఫ్‌ సెవెంటీ యాక్టు వచ్చిందని గుర్తు చేశారు. గతంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరుతో దోపిడీ చేస్తే… ప్రస్తుతం అదానీ, అంబానీలకు ఈ దేశాన్ని తాకట్టు పెడుతుందన్నారు. ఉద్యమాలు ద్వారానే హక్కులు సాధించుకునే పరిస్థితిని పాలకులు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. మానవ హక్కుల వేదిక నేత ఎస్‌.వి.కృష్ణ మాట్లాడుతూ నిర్బంధం ద్వారా కాకుండా సమాజం ముందుకు చేరే మార్గం ఏ రూపంలో ఎదుర్కోవచ్చో చెప్పమని అన్నారు. 20 ఏళ్ల క్రితం నిపుణుల కమిటీ కోరితే నిర్బంధం, అణచివేత ప్రధాన ఆయుధంగా చేసుకొని పాలకులు తమ గమన నీతిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. గత మూడున్నర నెలలో కాలంలో 135 మంది ఉద్యమకారులపై ఏకపక్ష కాల్పులు చేపట్టారని అన్నారు. కార్యక్రమంలో విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవెల్లి కృష్ణ, తాండ్ర ప్రకాశరావు, సన్యాసిరావు, పత్రి డానేసు పాల్గొన్నారు. ముందుగా నిర్వహించిన సంస్కృతిక కళాకారులు తమ గీతాలను ఆలోచింపజేశారు.

 

➡️