సమావేశంలో మాట్లాడుతున్న ఆంజనేయులు
- ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశాన్ని స్థానిక ఎన్‌జిఒ హోంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దేశంలోని 13 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం అమలవుతోందని, ఈ విధానం పరిశీలనకు రాష్ట్రానికి చెందిన అధికారులను పంపాలని కోరారు. అవసరమైతే వారితో పాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులూ అవకాశం కల్పించాలన్నారు. కీ.శే వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జర్నలిస్టులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులతో పాటు అందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఇచ్చిన జిఒ విధానాన్ని అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వాల హయాంలో పాలన చివరి రోజుల్లో ఇళ్ల స్థలాల అంశాన్ని తెరపైకి తేవడం మినహా కార్యరూపం దాల్చలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో సిసిఎల్‌ఎ పరిధిలో స్థలాలను ఎంపిక చేసి, జిల్లాల్లో ఉండే జర్నలిస్టులకు స్థలాలు కేటాయించాలన్నారు. కలెక్టర్లు, తహశీల్దార్లకు స్థలాలు ఎంపిక చేసే విధానం తీసుకురావడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్లస్థ లాలు, ఇళ్లు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, అక్రిడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలను సమావేశానికి హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌కు వివరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీనిచ్చారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.వేణుగోపాల్ ఆధ్వర్యాన జిల్లా అధ్యక్షులు సదాశివుని కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, బిఎస్‌పి నాయకులు సూర్యనారాయణ, మీడియా జెఎసి కన్వీనర్ ఎస్.జోగినాయుడు, ఎన్‌ఎజె జాతీయ కార్యవర్గ సభ్యులు సత్తారు భాస్కరరావు, ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు ఎస్.వి రమణ, విశాఖ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టి.భీమారావు, డి.ఆనందరావు, బి.వాసుదేవరావు, భేరి చిన్నారావు పాల్గొన్నారు.