ప్రజాశక్తి- ఆమదాలవలస
మండలంలోని గాజులకొల్లివలస సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయం వద్ద నిర్వహించిన జాతరకు వేలల్లో యాత్రికులు పోటెత్తారు. మంగళ, బుధవారాలు జాతర నిర్వహించారు. గురువారం కూడా కొనసాగుతుంది. ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి యాత్రికులు వచ్చి పాల్గొన్నారు. సంగమేశ్వర కొండపై గుహలో ఉన్న సంగమేశ్వర స్వామిని దర్శించుకుని, కొండ దిగువ భాగంలో నిర్వహించిన జాతరలో చిన్న, పెద్ద అంతా పాల్గొని ఆనందంగా గడిపారు. జాతరలో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, వీల్ చైర్, రకరకాల ఆటలను అందరూ ఆడి ఆనందంగా గడిపారు. ఏటా నిర్వహించే ఈ జాతరకు ఈ ఏడాదీ అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో జాతర నిర్వహించే ప్రాంతం అంతా యాత్రికులతో కిక్కిరిసిపోయింది. జాతరలో చిన్నారులు, పెద్దలు పాల్గొని వారికి కావాల్సిన ఆట వస్తువులు, తినుబండారాలను కొనుగోలు చేసి సందడిగా గడిపారు. ఈ జాతరకు జిల్లాలో ఉన్న ప్రజానీకంతో పాటు, ఇతర జిల్లాల్లో ఉద్యోగరీత్యా ఉన్న ఉద్యోగులు, వలస కూలీలు, బంధువులు అధిక సంఖ్యలో తరలిరావడంతో జాతర ప్రాంతమంతా సందడి వాతావరణం నెల కుంది. అలికాం-బత్తిలి ప్రధాన రహదారిపై వాహ నాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారు లు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అనధికార ఆశీల వసూళ్లు మండలంలోని గాజులకొల్లివలస పంచాయతీ పరిధిలో ఉన్న సంఘమేశ్వర స్వామి జాతరలో అనధికార ఆశీల వసూళ్లపై చిరు వర్తకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఏటా సంఘమేశ్వర స్వామి జాతర నిర్వహించి మూడు రోజులు ఇక్కడకు వచ్చి చిన్న పిల్లల ఆటబొమ్మలు తినుబండారాలు అమ్మగా వచ్చే డబ్బులతో తాము జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ, ఈ ఏడాది మొదటిరోజు పండగ జాతరకు వచ్చే ప్రజలుం తగ్గారని, అలాగే ఆశీల వసూళ్లు ఇలా అన్ని విధాల ఆదాయం తగ్గడంతో ఇబ్బందులకు గురవుతున్నామని చిరు వర్తకులు వాపోతున్నారు. దుకాణానికి ఒకలా రూ.వంద నుంచి రూ.500 వరకు వివిధ రకాలుగా ఆశీలు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షకపాత్రఏటా పండగ, కనుమ ముక్కనుమ మూడు రోజుల పాటు నిర్వహించే సంఘమేశ్వర జాతరలో పోలీసు అధికారులు కూడా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక కమిటీ వారికి నచ్చిన విధంగా వ్యవహరిస్తుంటే వారికి వత్తాసు పలుకుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతరకు వచ్చే మహిళలను ఆకతాయిలు వేధిస్తుంటారని, అలాగే అలికాం – బత్తిలి ప్రధాన రహదారిపై ఏటా వాహనాలు ఎక్కడికక్కడ గంటల కొద్దీ నిలిచిపోయి వాహనదారులు, ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతుంటారని, ఆ సమస్యలను గట్టెక్కించాల్సిన పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకొని గమ్యస్థానాలకు చేరుకోలేక పోతున్నామని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. రహదారి రద్దీని నివారించాల్సిన పోలీసులు చేతులెత్తేస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు సరైన ప్రణాళికతో వ్యవహరించి వాహనాల రద్దీని నివారించాలని పలువురు వాహనదారులు ప్రయా ణికులు యత్రికులు ముక్తకంఠంతో కోరుతున్నారు.సెక్రటరీ వివరణ అనధికార ఆశీల వసూళ్లపై పంచాయతీ సెక్రటరీ రవిని వివరణ కోరగా, పంచాయతీకి గాని, ప్రభుత్వానికి గాని ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తాము ఎవరికి ఎటువంటి వసూళ్లకు అనుమతులు ఇవ్వలేదని అన్నారు. ఆశీల వసూళ్లు తమ దృష్టికి రాలేదని చెబుతుండడం విశేషం. పంచాయతీ పరిధిలో ఎటువంటి కార్యక్ర మాలు నిర్వహించినా అది పంచాయతీ కార్యదర్శిదే బాధ్యత అని పలువురు గుర్తుచేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి తనకు ఏమి సంబంధం లేదనడం పలు విమర్శలకు తావిసోంది. పలాస : పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో హట్కో కాలనీ పరిధిలో డేకురుకొండ ఉత్సవం సంక్రాంతి సందర్భంగా ఘనంగా జరిగింది. డేకురు కొండ ప్రాంతంలో భీముడు పాదాలు ఉంటాయి. జారుడు బల్ల లాంటి రాళ్లు ఉండటంతో ఏటా నవ దంపతులు వాటిని దర్శించుకుంటారు. కనుమ రోజున నిర్వహించిన యాత్ర పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది.పొందూరు: పొందూరు మండలంలోని రాపాక, పొందూరు, కనిమెట్ట గ్రామాల్లో సంక్రాంతి పండగను పురస్కరించుకుని బుధవారం కునుమ సందర్భంగా కోడేబళ్లు జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోడేబళ్లు వీధుల్లో పరుగులు పెట్టడంతో వాటి వెంట యువత పరుగులు పెడుతూ సందడి చేశారు. కొన్నేళ్లుగా ఈ గ్రామాల్లో కోడేబళ్లు జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. బూర్జ : బూర్జలోని చాకలి లచ్చమ్మ పేరంటాల జాతర గ్రామస్తులు సహాయ సహకారాలతో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే అధిక సంఖ్యలో యాత్రికులు పాల్గొన్నారు. దీంతో లచ్చమ్మ తల్లి నామస్మరణతో ఆ గ్రామం మారుమోగింది.