మాట్లాడుతున్న మురళీకృష్ణ నాయుడు
ప్రజాశక్తి- శ్రీకాకుళం
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఉన్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.వి.మురళీకృష్ణ నాయుడు డిమాండ్ చేశారు. నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధ్యక్షులు సనపల రామకృష్ణ అధ్యక్షతన రాష్ట్రస్థాయి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అసోసియేషన్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014-19 సంవత్సరాల మధ్య పెండింగ్‌లో ఉన్న పిఆర్ పరిధిలోని ఇంజినీర్లపై గతంలో పెట్టిన కేసులు రద్దు చేయాలన్నారు. 2014-19 మధ్యలో టిడిపి అధికారంలో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 25 వేల కిలోమీటర్ల పొడవున పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం రోడ్లు వేశారని, దేశానికి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సంపాదించిందని గుర్తుచేశారు. గ్రామీణాభివృద్ధిలో పిఆర్ ఇంజినీర్ల పాత్ర అమోఘమని కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పల్లెపండగ పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారులు నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఘనత పిఆర్ ఇంజినీర్లదేనని అన్నారు. మూడు దశాబ్దాలుగా రిక్రూట్మెంట్ లేక చాలీచాలని సిబ్బందితో పనులు చేస్తున్నామని అన్నారు. వెంటనే ఎపిసర్వీస్ కమిషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజినీర్ల రిక్రూట్మెంట్ చేపట్టాలని కోరారు. రాజకీయ కోణంలో 2019-24 మధ్యలో అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మందిపై తప్పుడు కేసులు బనాయించిందని, వీటిని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కె.సంగీతరావు, బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.