మాట్లాడుతున్న తులసీదాస్
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా చైతన్య యాత్రలు ఈ నెల 11 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నామని, ఈ యాత్రలను విజయవ ంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ పిలుపునిచ్చారు. నగరంలో సిపిఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జిల్లాలో జీడీ పంటకు గిట్టుబాటు ధర కల్పించి, ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో షెడ్యూల్డ్ ఏరియాతో కూడిన ఐటిడిఎను ఏర్పాటు చేయాలన్నారు. గిరిజన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించా లన్నారు. కార్గో ఏయిర్ పోర్టు కోసం బలవంతపు భూ సేకరణ ఆపాలన్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టొద్దన్నారు. వంశధార ఆధునికీకరణకు రూ.1500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పూర్తి స్థాయి నిధులు కేటాయించాలన్నారు. సమస్యలపై ప్రజా చైతన్య యాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహన రావు అధ్యక్షత వహించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, పి.తేజేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.