మాట్లాడుతున్న మోహనరావు
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోహనరావు డిమాండ్
ప్రజాశక్తి – మందస
రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిస్థాయిలో రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, మండల కార్యదర్శి ఎం.ధర్మారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం నిబంధనల పేరుతో కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం నమోదు చేయడానికి అధికారులు రోజు వారీ లక్ష్యాలను నిర్ణయించి ఉదయం ఆరు గంటల తర్వాత సాయంత్రం నాలుగు గంటల్లోపు మాత్రమే నమోదు చేయాలని నిబంధనల విధించారని చెప్పారు. దాన్ని ఆసరా చేసుకుని మిల్లర్లు ప్రైవేటుగా కొన్న ధాన్యాన్ని, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా తెచ్చిన ధాన్యాన్ని తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లతో రాత్రి ఒంటి గంటకే తప్పుడు పద్ధతుల్లో ఎంట్రీలు చేయిస్తున్నారని చెప్పారు. ఉదయం ఎంట్రీ కోసం వెళ్లిన రైతులకు అప్పటికే లక్ష్యాలు అయిపోయాయని, మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలు లేవని అధికారులు నిరాకరిస్తున్నారని తెలిపారు. దీనివల్ల వారాల తరబడి రైతులు ధాన్యం అమ్ముకోలేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకుండా తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని, రోజు వారీ లక్ష్యాలను తొలగించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. సమావేశంలో రైతుసంఘం నాయకులు కె.అంగదా, కె.ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.