జోరందుకోని ధాన్యం కొనుగోలు

ల్లాలో ఈ ఖరీఫ్‌

లారీలకు ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు

  • జిల్లాలో నేటికీ 80 కేంద్రాల్లో ప్రారంభం కాని ధాన్యం సేకరణ
  • 57 మంది బ్యాంకు గ్యారంటీలు సమర్పించని మిల్లర్లు
  • ప్రతికూల వాతావరణ పరిస్థితులూ మరో కారణం

ఇప్పటివరకు 65,750 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుజిల్లాలో ధాన్యం కొనుగోలు ఇంకా జోరందుకోలేదు. డిసెంబరు రెండో వారంలోకి ప్రవేశిస్తున్నా, జిల్లాలో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. అధికార యంత్రాంగంలో కొంత సన్నద్ధత కొరవడినట్లుగా కనిపిస్తోంది. ధాన్యం ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా చాలాచోట్ల తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులూ ధాన్యం సేకరణకు అడ్డంకిగా మారింది. తుపాను, అల్పపీడనాల దృష్ట్యా చాలాచోట్ల రైతులు నూర్పులను వాయిదా వేసుకున్నారు. మరోవైపు వర్షాలు పడడంతో తేమ చేరిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకుంటున్నారు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 3,59,495 ఎకరాల్లో వరి వేశారు. ఈ ఏడాది తొమ్మిది లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలు, తిండి గింజలకు పోనూ ఐదు లక్షల ధాన్యం వరకు మార్కెట్‌లోకి రావచ్చని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేశారు. అన్నీ లెక్క గట్టి చివరకు 4.90 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందు కనుగుణంగా కొనుగోలు కోసం 402 కేంద్రాలను గుర్తించారు. జిల్లాలో ఇప్పటివరకు 322 కేంద్రాలు తెరుచుకున్నాయి. వీటి ద్వారా 65,750 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వాస్తవానికి గత నెల 17 నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించినా, కొనుగోలు మాత్రం నెలాఖరులోనే ప్రారంభమయ్యాయి. సరిగ్గా నూర్పులు, కోతలు ఊపందుకుంటున్న తరుణంలో వరుస అల్పపీడనాలు, తుపాను నేపథ్యంలో రైతులు వాయిదా వేసుకున్నారు. దీంతో రైతు సేవా కేంద్రాలకు ధాన్యం రావడం తగ్గింది. ఇది ధాన్యం సేకరణపై ప్రభావం చూపింది.

మద్దతు ధర దక్కేనా?

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వరికి సాధారణ రకానికి రూ.2,300, గ్రేడ్‌-ఎ రకానికి రూ.2,320 మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కొంతమంది రైతులు తీసుకెళ్లిన ధాన్యం నాణ్యంగా లేవంటూ తిప్పిపంపారు. కొన్ని రైతు సేవా కేంద్రాల్లో తమ లక్ష్యం పూర్తయిందని, ఇక కొనలేమంటూ సిబ్బంది చెప్పడంతో, దళారులకు తక్కువ రేటుకే అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పటికే జలుమూరు, సారవకోట, నరసన్నపేట, బూర్జ, కొత్తూరు, హిరమండలం మండలాల్లో తక్కువ ధరకే రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం 80 కేజీల బస్తాకు రూ.1840 దక్కాల్సి ఉండగా, దళారులు రూ.1400కు కొంటున్నారు. అటు తూకంలోనూ అదనంగా రెండు నుంచి మూడు కేజీలు తీసుకుంటున్నారు.

నూర్పులకు రైతుల వెనకడుగు

వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడంతో ధాన్యం నూర్పులకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. తుపాను ప్రభావంతో ఈనెల 29 నుంచి రెండో తేదీ వరకు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అక్కడ నుంచి ఆకాశం మేఘావృతంగానే ఉంది. ఏ క్షణంలో వర్షపు జల్లులు కురుస్తాయోనన్న ఆందోళనతో రైతులు నూర్పులు చేయకుండా వేచిచూస్తున్నారు. మరోవైపు ఈనెల రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందన్న వార్తలతో రైతుల్లో ఒకింత ఆందోళన నెలకొంది.

బ్యాంకు గ్యారంటీలు

సమర్పించని మిల్లర్లుకొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. మిల్లులకు తరలించిన తర్వాత వాటిని మర ఆడించేందుకు 264 మిల్లులను ఎంపిక చేశారు. మర ఆడించేందుకు ఇస్తున్న ధాన్యం విలువకు సమానమైన బ్యాంకు గ్యారంటీలను మిల్లర్ల నుంచి పూర్తిస్థాయిలో బ్యాంకు గ్యారంటీలు సమర్పించలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు 57 మంది వరకు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వలేదు.

కొనుగోలు చేసింది 65 వేల టన్నులే…

జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 65,750 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొన్ని మండలాల్లో కనీసం వంద టన్నులు కూడా కొనలేదు. వజ్రపుకొత్తూరు మండలంలో అత్యల్పంగా 20 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. బూర్జలో 49 మెట్రిక్‌ టన్నులు, పలాసలో 39 మెట్రిక్‌ టన్నులు, రణస్థలంలో 92 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఎచ్చెర్లలో 857 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. సారవకోటలో అత్యధికంగా 11,293 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. జలుమూరులో 8,888 టన్నులు, కొత్తూరులో 6,558 మెట్రిక్‌ టన్నులు, కోటబొమ్మాళిలో 6,055 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు.

➡️