బూర్జ : పంట పొలం నుంచి ఇంటికి తరలిస్తున్న వరిచేను
తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
అత్యధికంగా కళింగపట్నంలో 10.5 మి.మీ
నేడూ జిల్లావ్యాప్తంగా వర్షాలు
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పెంగల్ తుపానుగా మారింది. దీని ప్రభావంతో శుక్రవారం జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. గార మండలం కళింగపట్నంలో అత్యధికంగా 10.5 మి.మీ వర్షం కురిసింది. జలుమూరులో 9.75 మి.మీ వర్షం పడింది. రణస్థలం మండలం పైడిభీమవరంలో 9.5 మి.మీ, లావేరు మండలం తామాడలో 9 మి.మీ, రణస్థలం మండలం గరికిపాలెంలో 8.75 మి.మీ వర్షపాతం నమోదైంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో 8.5 మి.మీ, శ్రీకాకుళంలో 7.75 మి.మీ, సంతబొమ్మాళిలో 7 మి.మీ, పోలాకిలో 6.5 మి.మీ వర్షం కురిసింది. నరసన్నపేట, ఎచ్చెర్లలో 6 మి.మీ చొప్పున వర్షం పడింది. ఆమదాలవలస, పొందూరులో 5.5 మి.మీ చొప్పున వర్షం పడింది. తుపాను ప్రభావంతో జిల్లాలో శనివారమూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.బూర్జ: ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నలకు వాయు గండం తప్పడం లేదు. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తుపాను రైతు నడ్డి విరుస్తుంది. మండలంలో రైతులు ఇప్పటికే సగం వరకు కోతలు పూర్తి చేశారు. మరికొంత మంది నూర్పులు చేసి ధాన్యాన్ని తేమ ఆరెందుకు గాలి కుప్పలు వేస్తున్నారు. మరో పది రోజులు పూర్తిస్థాయి కోతలు పూర్తవుతాయి. అయితే ఈలోపే తుపాను కారణంగా విస్తారంగా వర్షాలు పడుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కోతలు కోసి నూర్పులు చేసిన ధాన్యం కళ్ళల్లో ఉండడంతో తడిచి ముద్దవుతాయి. ధాన్యం తడిస్తే రంగు మారుతుందని, దళారులు తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తారని మదనపడుతున్నారు. భారీ వర్షం కురుస్తుండడంతో రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పుకోవడం, ధాన్యం రాశులను తడవకుండా కాపాడుకునే పనిలో నిమగమయ్యారు.పాతపట్నం: తుపాను ప్రభావంతో మండలంలోని ప్రహరాజపాలెం, కొరసవాడ, బూరగాం, లోగిడి, గంగువాడ, తెంబూరు గ్రామాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి చేను కోసి ఉండడంతో తడిచిపోయాయి. మరికొంతమంది ఆదరాబాదరగా పొలాల్లో కుప్పలు పెట్టారు. అలాగే యంత్రాలతో వరి నూర్పు చేపట్టారు. కళ్లాలోకి పంటలను తీసుకొచ్చి టార్పాలిన్లను కప్పుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు.