కేంద్రమంత్రిగా రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం పార్లమెంటు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇచ్చే మంత్రి పదవుల్లో రామ్మోహన్‌ నాయుడుకు కేబినెట్‌ హోదా లభించింది. యువత, సామాజిక తరగతి, పార్టీ విధేయత వంటి సమీకరణాల నేపథ్యంలో ఆయన్ను ఈ పదవి వరించింది. శ్రీకాకుళం ఎంపీగా వరుసగా మూడుసార్లు ఎన్నికైన ఆయన అందరితో కలుపుగోలుగా ఉండడం, చొరవ, సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించడం వంటివి ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ గుర్తింపే కేంద్రమంత్రి పదవి దక్కేలా చేసింది. రామ్మోహన్‌ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కీర్తిశేషులు వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. దీంతో తండ్రీ తనయులిద్దరూ కేంద్రమంత్రులుగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. తొమ్మిదో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో రామ్మోహన్‌ నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్మోహన్‌ నాయుడుకు ప్రాధాన్యత గల శాఖ దక్కే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది.

➡️