సమస్యల నడుమ చదువు

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు

తాళం వేసి ఉన్న మరుగుదొడ్డి

అరకొర వసతలతో ఇబ్బందులు

నాబార్డు నుంచి రాని నిధులు

మరుగుదొడ్లుకి తాళం వేసిన కాంట్రాక్టర్‌

పాఠశాలల్లో విద్యార్థినులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా వారి సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని 2012 అక్టోబరు నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. విద్యాశాఖ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూత్రశాలలు, మరుగు దొడ్లు ఏర్పాటు చేయని కారణంగా సర్కారు బడుల్లోని విద్యార్థులు ఆరుబయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితే నెలకొంటోంది.

ప్రజాశక్తి- జి.సిగడాం

జి.సిగడాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. నాడు-నేడు పథకానికి ప్రభుత్వ నిధులు కేటాయించ కపోవడంతో బిల్లులు చెల్లించని కారణంగా గుత్తేదారు పాఠశాల మరుగుదొడ్లకు తాళం వేశారు. ఈ నేపథ్యంలో మరుగుదొడ్లు లేక విద్యార్థులతో పాటు మహిళా ఉపాధ్యాయులు సైతం ఆరుబయటకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను నాడు నేడు మొదటి విడతలో భాగంగా రూ.1.38 కోట్లు నిధులు కేటాయించారు. ఆ పనులను నాబార్డు గుత్తేదారులకు అప్పగించింది. అప్పటివరకు శిథిలావస్థలో ఉన్న పాఠశాల పాత మరుగుదొడ్లను ధ్వంసం చేసి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ నూతన మరుగుదొడ్లు నిర్మించ లేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉపాధ్యాయుల కోసం ఉన్న ప్రత్యేక మరుగుదొడ్లను 2018లో నిర్మించినా వాటికి కూడా ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా గుత్తేదారు వాటికి తాళం వేశారు. జి.సిగడాంతో పాటు చుట్టుపక్కల 16 గ్రామాల నుంచి ఈ పాఠశాలలో 420 మంది విద్యార్థులు చదువు తున్నారు. ఇందులో 160 మంది బాలికలు ఉన్నా బాలికల కోసం ప్రత్యేకంగా కనీసం సౌకర్యాలు లేవని ఆరోప ిస్తున్నారు. బాలురుతో పాటు బాలికలు సైతం మరుగుదొడ్ల కోసం ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు బయట మరుగు దొడ్లు వినియోగించడం వలన బాలికలకు పలు అనారోగ్య సమస్యలు దారితీస్తున్నాయంటున్నారు. వెంటనే విద్యా శాఖాధికారులు, ప్రభుత్వం కల్పించుకొని మరుగు దొడ్లు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.సమస్యలు అధికంపాఠశాలలో మరుగుదొడ్లతో పాటు తరగతి గదుల్లో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఉపాధ్యాయులే అరకొర నిధులతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నెట్టుకు వస్తున్నారు. పదవ తరగతి పరీక్షలు సమయంలో కూడా మౌలిక వసతులు లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. మరుగుదొడ్లు మౌలిక వసతులు లేని కారణంగా పాఠశాలలో చేరే బాలికల సంఖ్య తగ్గుముఖం పడుతుందని, తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని హెచ్‌ఎం చెబుతున్నారు.తాగునీటి సమస్యతాగునీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో భోజనం చేశాక విద్యార్థులు తాగునీటి కోసం పాఠశాలకు సమీపంలో గల బోరుకి వెళ్లి దాహం తీర్చుకుంటున్నారు. వంట చేయడానికి కూడా మంచి నీరు బోరు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని వంట చేసే మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా తరగతి గదులు లేవువిద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కట్టిన మరుగుదొడ్లకుకు ప్రభుత్వం బిల్లు చెల్లించకపోయినా తమ విజ్ఞప్తి మేర కాంట్రాక్టర్‌ వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. మూడేళ్లయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో కొన్ని నెలల క్రితం మరుగుదొడ్లకు తాళం వేశారు. బిల్లులు రాకపోవడం వల్లే తాళం వేస్తున్నట్లు కాంట్రక్టర్‌ తెలిపారన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాల నుంచి విద్యార్థులు వేరే పాఠశాలలకు వెళ్తున్నారు. అధికారలు స్పందించి చర్యలు తీసుకోవాలి. – పి.వి.నరసింహామూర్తి, ప్రధానోపాధ్యాయులు

 

➡️