నవంబరు 6 వరకు ఉపాధ్యాయ ఓటర్ల నమోదు

ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల

మాట్లాడుతున్న విశాఖ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌

  • విశాఖ కలెక్టర్‌ ఎం.ఎన్‌ హరేందిర ప్రసాద్‌

ప్రజాశక్తి – విశాఖపట్నం

ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖపట్నం కలెక్టర్‌ ఎం.ఎన్‌ హరేందిర ప్రసాద్‌ సూచించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను అనుసరించి సెప్టెంబర్‌ 30వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడిందని, అదే రోజు నుంచి ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. నవంబరు ఆరో తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. నవంబరు 23న ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్‌ పబ్లిష్‌ అవుతుందని, 23 నుంచి డిసెంబరు తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీకి ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గడువు ముగుస్తుందని, ఈ నేపథ్యంలో సంబంధిత ఓటర్ల జాబితా రూపకల్పనపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో 34 ఇఆర్‌ఒలు, 187 మంది ఇఆర్‌ఒలను నియమించామని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఇఆర్‌ఒగా విశాఖపట్నం రెవెన్యూ అధికారి కె.మోహన్‌ కుమార్‌ వ్యవహరిస్తారని తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఆయా జిల్లాల పరిధిలో నియమించిన అధికారుల వద్ద గానీ ష్ట్ర్‌్‌జూ://షషష.షవశీaఅసష్ట్రతీa.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో గానీ ఫారం-19 సమర్పించవచ్చని చెప్పారు.ఎయిడెడ్‌, ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులూ అర్హులేఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు సెకండరీ స్థాయికి (ఆరో తరగతికి పైబడి) మించిన పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా అర్హులేనని స్పష్టం చేశారు. పార్ట్‌ టైమ్‌ విధానంలో పనిచేసే వారు అర్హులు కారని తెలిపారు. ఓటు నమోదులో భాగంగా స్వీయ ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత సంస్థ హెచ్‌ఒడి నుంచి సర్టిఫికేట్‌ తీసుకొని సమర్పించాలన్నారు. ప్రయివేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వీటితోపాటు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కౌంటర్‌ సైన్‌ చేసిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కళాశాల స్థాయిల్లో పనిచేసే వారు సంబంధిత ఆర్‌జెడిల కౌంటర్‌ సైన్‌తో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందన్నారు. యూనివర్శిటీ స్థాయిలో పనిచేసేవారు విసి నియమించిన అర్హత గల అధికారుల నుంచి కౌంటర్‌ సైన్‌ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గత ఆరేళ్లలో సెకండరీ స్థాయికి మించిన ఏ విద్యాసంస్థలో అయినా మూడేళ్లకు తగ్గకుండా పనిచేసిన ఉపాధ్యాయులు అర్హులన్నారు. వారంతా నవంబరు ఆరో తేదీ లోగా ఫారం-19 సమర్పించటం ద్వారా ఓటరుగా నమోదు కావాలని సూచించారు. గతంలో ఓటు ఉన్న వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని, పాత ఓటు చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌ కుమార్‌, ఆర్‌డిఒలు, ప్రత్యేక ఉప కలెక్టర్లు, తహశీల్దార్లు, ఎలక్షన్‌ డిటిలు, ఎలక్షన్‌ సెల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️