ఓటరు ముసాయిదా జాబితా విడుదల

జిల్లావ్యాప్తంగా ఓటర్ల

మాట్లాడుతున్న డిఆర్‌ఒ వెంకటేశ్వరరావు

  • నవంబరు 28 వరకు సవరణలకు గడువు
  • జనవరి 6న తుది ఓటర్ల జాబితా విడుదల
  • జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లావ్యాప్తంగా ఓటర్ల జాబితా-2025 ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. వీటిపై అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిపై నవంబరు 28వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన ఓటర్ల జాబితా తయారీలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 20 నుంచి అక్టోబర్‌ 18వ తేదీ వరకు బిఎల్‌ఒలు ఇంటింటా సర్వే నిర్వహించారని చెప్పారు. మృతులు, వలస ఓటర్ల తొలగింపుతో పాటు 2025 జనవరి ఒకటో తేదీ నాటికి అర్హులైన వారి నుంచి కొత్తగా ఫారం-6 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లుఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు మంగళవారం నుంచి నవంబరు 28వ తేదీ వరకు గడువుగా ప్రకటించారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ నవంబర్‌ 9, 10, 23, 24న ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణల నిమిత్తం దరఖాస్తులు స్వీకరించనున్నామన్నారు. డిసెంబర్‌ 24వ తేదీ వరకు వచ్చిన వాటిపై విచారించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. జనవరి 6న తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ ఏడాది మే 13న జరిగిన పోలింగ్‌ నాటికి జిల్లాలో మొత్తం 18,59,910 మంది ఓటర్లు కాగా, అందులో 9,22,442 పురుషులు, 9,37,329 మంది స్త్రీలు ఉన్నారని చెప్పారు. తాజాగా ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం ఆ సంఖ్య 18,77,426కి చేరిందని వివరించారు. ఇందులో16240 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని, మిగతా వారిలో పురుషులు 9,30479 కాగా, మహిళలు 9,46,817 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 16,338 మంది ఎక్కువగా ఉన్నారని వివరించారు. వీరితో పాటు ఇతరులు 130 మంది ఉన్నారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 2,358 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని వివరించారు.23న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు జాబితా విడుదలఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చేపట్టిన ఓటర్ల నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, వచ్చే నెల 23న ఓటర్ల ముసాయిదా విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఓటర్ల జాబితాలో చేర్పులకు డిసెంబరు 8 చివరి తేదీ అని, ఈలోగా అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో సి-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు పాల్గొన్నారు.

➡️