గురజాడ 109వ వర్ధంతి సభలో వక్తలు
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్: దేశంలో మతవిద్వేషాలు రగిలించి సామరస్యాన్ని శాంతిని భంగపరిచే మతోన్మాద శక్తులు చెలరేగుతున్న నేటి పరిస్థితులలో మహాకవి గురజాడ బోధనల్ని ప్రజల్లోకి ముఖ్యంగా యువతలోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నారు. శ్రీకాకుళంలో గురజాడ 109వ వర్ధంతి సందర్భంగా సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో గురజాడ దేశభక్తి గీతాన్ని పాడుకుంటూ నిర్వహించిన ర్యాలీ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ర్యాలీ డే అండ్ నైట్ జంక్షన్ నుండి ప్రారంభమై ఆర్టీసీ కాంప్లెక్స్ అంబేద్కర్ జంక్షన్ మీదుగా ఆర్ట్స్ కాలేజీ మైదానం వరకు సాగింది. అనంతరం జరిగిన సభకు సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాసు అధ్యక్షత వహించారు .ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి అట్టాడ అప్పలనాయుడు గరిమెళ్ళ విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వీజీకే మూర్తి పూలమాలవేసి నివాళి అర్పించారు. అప్పలనాయుడు మాట్లాడుతూ గురజాడ రచనలు దేశభక్తిని, మహిళా ఉద్ధరణ, అణగారిన వర్గాల అభ్యున్నతిని, నిరుద్యోగ నిర్మూలనని కాంక్షించాయని అన్నారు. కవి కంచరాన భుజంగరావు మాట్లాడుతూ రచనకు సంబంధించిన అన్ని ప్రక్రియలలోనూ గురజాడ ఆద్యుడని పేర్కొన్నారు. కవిత గేయం, కథ , నాటకం, వ్యాసాలు, అనువాదాలు అన్నిటిలోనూ గొప్ప ప్రమాణాలు నెలకొల్పారని అందుకే ఆయన కవి శేఖరుడు వైతాళికుడు అయ్యారని అన్నారు. ఎన్సీసి కమాండెంట్ డాక్టర్ వై పోలి నాయుడు మాట్లాడుతూ తెలుగు భాషకు గురజాడ గొప్ప సేవ చేశారని నేడు ఆ భాషను బ్రతికించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడిందని యువత ఆ కర్తవ్య దీక్షలో ముందుకు సాగాలని పిలిపిచ్చారు. అంతర్జాతీయ స్థాయి కవి అయిన గురజాడకు తగిన నివాళి దేశం ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి నాయకులు బాడాన శ్యామలరావు, డాక్టర్ కే ఉదయ్ కిరణ్, నెట్టిమి రమణ పూజారి, దివాకర్ డి రామకృష్ణ విజ్ఞాన కేంద్రం తరఫున ఎం ప్రభాకర్, పి సుధాకర్ రావు, మహిళా నాయకురాలు కె నాగమణి, విద్యార్థి నాయకులు సంతోష్ జనార్ధన్, గాయకులు చింతాడ రామచందర్రావు, తదితరులు పాల్గొన్నారు.