ర్యాలీ నిర్వహిస్తున్న సాహితీ స్రవంతి ప్రతినిధులు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
దేశంలో మతవిద్వేషాలు రగిలించి సామరస్యాన్ని శాంతిని భంగపరిచే మతోన్మాద శక్తులను అడ్డుకుని మహాకవి గురజాడ అప్పారావు బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు పేర్కొన్నారు. గురజాడ 109వ వర్థంతి సందర్భాన్ని పురస్కరించుకుని సాహితీ స్రవంతి ఆధ్వర్యాన ఆయన రాసిన దేశభక్తి గీతాన్ని పాడుతూ నగరంలోని డేఅండ్‌నైట్ కూడలి నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు శనివారం ర్యాలీ నిర్వహించా రు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎన్‌సిసి విద్యార్థులు, యువతతో కలిసి సభ నిర్వహించారు. ఈ సభకు సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాసు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి అట్టాడ అప్పలనాయుడు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి.జి.కె.మూర్తిలు పూలమాలవేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ గురజాడ రచనలు దేశభక్తిని, మహిళా ఉద్దరణ, అణగారిన తరగతుల అభ్యున్నతిని, నిరుద్యోగ నిర్మూలనని కాంక్షించాయని అన్నారు. కవి కంచరాన భుజంగరావు మాట్లాడుతూ రచనకు సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ గురజాడ ఆద్యుడని పేర్కొన్నారు. కవిత గేయం, కథ, నాటకం, వ్యాసాలు, అనువాదాలు అన్నిటిలోనూ గొప్ప ప్రమాణాలు నెలకొల్పారని అందుకే ఆయన కవి శేఖరుడు వైతాళికుడు అయ్యారన్నారు. ఎన్‌సిసి కమాండెంట్ డాక్టర్ వై.పోలినాయుడు మాట్లాడుతూ తెలుగు భాషకు గురజాడ గొప్ప సేవ చేశారని, ఆ భాషను ప్రస్తుతం బతికించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. యువత ఆ కర్తవ్య దీక్షలో ముందుకు సాగాలని పిలిపిచ్చారు అంతర్జాతీ య స్థాయి కవి అయిన గురజాడకు తగిన నివాళి దేశం ఇవ్వాల్సి ఉందన్నారు కార్యక్రమంలో సాహితీ స్రవంతి నాయకులు బాడాన శ్యామలరావు, డాక్టర్ కె.ఉదరు కిరణ్, నెట్టిమి రమణ, పూజారి దివాకర్ డి.రామకృష్ణ, విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు ఎం.ప్రభాకర్, పి.సుధాకరరావు, మహిళా నాయకులు కె.నాగమణి, విద్యార్థి నాయకులు సంతోష్, జనార్థన్, గాయకులు చింతాడ రామచందర్రావు పాల్గొన్నారు.