అరసవల్లిలో కూల్చివేసిన దుకాణ సముదాయం
- అరసవల్లి అధికారుల నిర్వాకం
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
రథసప్తమి వేడుకల పేరిట అరసవల్లి సూర్యనారాయణ స్వామి అధికారుల హడావుడి చిరు వ్యాపారుల పొట్ట కొడుతోంది. ఆలయానికి ఎదురుగా ఉన్న టిటిడి కళ్యాణ మండపానికి ఆనుకుని దేవాదాయ శాఖ కొన్నేళ్ల కింద దాత సహకారంతో దుకాణ సముదాయాలను నిర్మించింది. అందులోనే మేడపై ట్రైమెక్స్ సంస్థ సహకారంతో నిత్యన్నదాన పథకాన్ని, సూర్య నమస్కారాలు నిర్వహించేందుకు హాలు, ప్రసాద విక్రయాలతో పాటు వంటశాల నిర్వహించేవారు. ఆలయానికి ఎదురుగా దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని అద్దె ప్రాతిపదికన వ్యాపారులకు కేటాయించి, నెల వారీ అద్దెను వసూలు చేస్తున్నారు. డిపాజిట్ రూపంలో మొదట్లో కొంత మొత్తాన్ని ఆలయ అధికారులు సేకరించారు. కొన్నేళ్లుగా అక్కడ పలు కుటుంబాలు చిరు వ్యాపారాలు చేసుకుని జీవనాన్ని సాగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద రూ.వంద కోట్లు ఇస్తుందని ప్రభుత్వ పెద్దలు ప్రకటించగానే, హడావుడిగా ముందున్న భవన సముదాయాన్ని తొలగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వాటిని తొలగిస్తే విశాలమైన స్థలం ఉంటుందని, ఆపై ఇంద్రపుష్కరిణి, ఆలయ భూముల్లో కట్టడాలు నిరించుకోవచ్చని సూచించారు. అంతవరకు బాగానే ఉన్నా అందులో సుదీర్ఘ కాలంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారులకు కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా అధికారులు హడావుడిగా ఖాళీ చేయించి భవనాలను పడగొట్టేశారు. ఆలయంలో జరిగే అతి పెద్ద ఉత్సవం రథసప్తమి. ఈ వేడుకల సమయంలోనే వారికి వ్యాపారాలు సాగుతాయి. ఇటువంటి సమయంలో ప్రత్యామ్నాయం చూపకుండా దుకాణ సముదాయాన్ని కూల్చివేయడంపై వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. చిరు వ్యాపారుల జీవనోపాధి లేకుండా చేశారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రత్యామ్నాయం చూపాలని వ్యాపారులు కోరుతున్నారు.