కుంభమేళా స్పెషల్‌ బస్సులకు స్పందన

శ్రీకాకుళం నుంచి

జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న విజరు కుమార్‌

* 16న అదనంగా మరో బస్సు

* జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.విజరు కుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

శ్రీకాకుళం నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాకు వెళ్లే వారి కోసం ఈనెల 8వ తేదీన ఆర్‌టిసి ఏర్పాటు చేసిన స్పెషల్‌ సూపర్‌ లగ్జరీ బస్సుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.విజరు కుమార్‌ తెలిపారు. దీంతో ఈనెల 12వ తేదీన మరో స్పెషల్‌ బస్సును ఏర్పాటు చేయగా, ఆ బస్సు టిక్కెట్‌ బుకింగ్స్‌ పూర్తయ్యాయన్నారు. ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనకు అనుగుణంగా ఈనెల 16న మరో ప్రత్యేక సర్వీసును మహా కుంభమేళాకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 16న శ్రీకాకుళం బస్‌ స్టేషన్‌ నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఈ బస్సు బయల్దేరుతుందన్నారు. మొత్తం 7 రోజుల్లో రెండో రోజు ఉదయానికి పూరి చేరుకుంటుందని చెప్పారు. పూరీలో జగన్నాథ స్వామి వారి దర్శనం, కోణార్క్‌, సాయంత్రం భువనేశ్వర్‌లోని లింగరాజ్‌ ఆలయం దర్శించుకున్న తర్వాత మూడో రోజు సాయంత్రానికి ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటుందన్నారు. నాలుగో రోజు త్రివేణి సంగమంలో స్నానాల తర్వాత రాత్రి బయలుదేరి ఐదో రోజు ఉదయానికి వారణాశి చేరుకుంటుందని తెలిపారు. కాశీ విశ్వేశ్వరుని దర్శన అనంతరం ఆరో రోజు ఉదయం వారణాశి నుంచి బయలుదేరి గయ, బుద్ధగయ క్షేత్రాల దర్శనానంతరం ఏడో రోజు రాత్రికి శ్రీకాకుళం చేరుకుంటుందని వివరించారు. ఈ సర్వీస్‌కు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పది కిలోమీటర్ల లోపు 35 మంది ప్రయాణికులు ఒకేచోటు నుంచి బయల్దేరితే బస్సు వారు కోరిన ప్రదేశానికి పంపుతామన్నారు. టిక్కెట్‌ ఒకరికి రూ.9,500 అని, యాత్ర సమయంలో యాత్రికులకు ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర, వసతి ఖర్చులు యాత్రికులు భరించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9959225608, 9959235609, 9959225610, 9959225611, 7382917289, 7382921647, 7382923311, 7382924758 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.

➡️