రిక్తహస్తం

జిల్లాలో 3.90 లక్షల మంది రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో

డ్జెట్‌లో సిక్కోలుపై శీతకన్ను

ఊసే లేని వెనుకబడిన ప్రాంత గ్రాంట్‌

న్యూక్లియర్‌ ఎనర్జీలో ప్రైవేట్‌కు సహకారంపై బడ్జెట్‌లో ప్రస్తావన

కొవ్వాడ అణు విద్యుత్కేంద్రానికి ఊతమిచ్చేలా ఉన్నాయంటూ చర్చ

టిడిపి మద్దతుపై ఆధారపడిన కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం జిల్లాకు కొత్త ప్రాజెక్టులు, ఆగిపోయిన వెనుకబడిన ప్రాంత నిధులు ఇస్తుందని ఆశించిన ప్రజలకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టిన 2025-26 కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి చూపింది. సాధారణ కేటాయింపులు మినహా ప్రత్యేకించి నిధులు, ప్రాజెక్టులేవీ లేకపోవడంతో అంతా పెదవి విరుస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఏడాదికి రూ.50 కోట్ల గ్రాంట్‌ ఇస్తామని గతేడాది జూలై బడ్జెట్‌లో చెప్పిన ప్రభుత్వం, ఈసారి అదీ లేదు. జిల్లాకేమీ ఇవ్వకపోగా, ప్రమాదకర అణు విద్యుత్కేంద్రం పనులకు ఊతమిచ్చేలా న్యూక్లియర్‌ ఎనర్జీ రంగంలో ప్రైవేట్‌కు సహకారం అందిస్తామంటూ ప్రకటించడంపై అందరిలోనూ ఆందోళన రేగుతోంది. ఆదాయపు పన్ను మినహాయింపులోనూ పెద్దగా ప్రయోజనం లేదని ఉద్యోగులు పెదవివిరుస్తున్నారు. మొత్తమ్మీద కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ అన్ని తరగతులనూ అసంతృప్తికి గురిచేసింది.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో 3.90 లక్షల మంది రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో కలిపి ఆరు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని 2014లోనే బిజెపి ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటివరకు అమలు కాలేదు. మద్దతు ధరలకు గ్యారంటీ చట్టం చేయాలని రైతులు ఇప్పటికీ ఆందోళనలు సాగిస్తునా, కేంద్ర ప్రభుత్వం దాని జోలికి వెళ్లలేదు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కడం సందేహంగానే ఉంది. కందులు, మినుమలు కొనుగోలు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం రైతులకు కాస్త ఊరటనిస్తోంది. జిల్లాలో రబీ సీజన్‌లో 60,983 ఎకరాల్లో మినప, ఖరీఫ్‌లో 230 ఎకరాల్లో కందులు సాగవుతున్నాయి. ప్రభుత్వపరంగా కొనుగోలు లేకపోవడంతో మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ తర్వాత జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో రైతులు కొబ్బరి పంటను సాగు చేస్తున్నారు. కోకోనట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని చాలాకాలంగా ఉద్దానం రైతులు కోరుతున్నారు. కవిటిలో స్థలసేకరణ కూడా చేపట్టారు. ఆ అంశమూ బడ్జెట్‌లో ప్రస్తావనకు రాలేదు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు జీడి పంటకు మద్దతు ధరతో పాటు జీడి బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చినా కేంద్ర బడ్జెట్‌లో మాత్రం కనిపించలేదు.అణు విద్యుత్కేంద్రం పనులకు ఉతమిచ్చేలా ప్రస్తావనజిల్లాకేమీ ఇవ్వకపోగా, ప్రమాదకర అణు విద్యుత్కేంద్రం పనులకు ఊతమిచ్చేలా వికసిత్‌ భారత్‌ 2047లో భాగంగా న్యూక్లియర్‌ ఎనర్జీ రంగంలో ప్రైవేట్‌కు సహకారం అందిస్తామంటూ బడ్జెట్‌లో ప్రకటించడంపై ఆందోళన రేగుతోంది. రణస్థలం మండలం కొవ్వాడలో 1208 మెగావాట్ల సామర్థ్యం గల ఆరు అణు రియాక్టర్ల ఏర్పాటుకు 2017లో టిడిపి హయాంలో 2079 ఎకరాలను సేకరించారు. జిల్లా అధికారులు రూపొందించిన విజన్‌ 2024-29 డాక్యుమెంట్‌లో జిల్లాలో పారిశ్రామిక, గృహావసరాలకు అణు విద్కుత్కేంద్రం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పొందుపరిచారు. దీంతో ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న అణు విద్యుత్కేంద్రం పనులు మళ్లీ ఊపందుకోనున్నాయనే చర్చ సాగుతోంది.జిల్లాకు పిఎం ధన్‌ ధాన్య యోజన దక్కేనా?రైతుల కోసం దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో పిఎం ధన ధాన్య యోజన పధకం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. తక్కువ ఉత్పాదకత, వెనుకబడిన ప్రాంతం, నీటి సౌకర్యం లేని వెనుబడిన ప్రాంతాల ప్రాతిపదికన ఎంపిక చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు ఆ పథకం వచ్చే అవకాశం ఉండవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న రైతులకు రుణ సౌకర్యాన్ని మాత్రం రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు పెంచింది. జిల్లాలో ఖరీఫ్‌, రబీ సీజన్‌లో పంట రుణాలు పొందుతున్న రైతులు 2.90 లక్షల మంది వరకు ఉన్నారు.ప్రస్తావన లేని వెనుకబడిన ప్రాంత గ్రాంట్‌విభజన చట్టంలో పేర్కొన మేరకు వెనుకబడిన ప్రాంత ప్యాకేజీ కింద రాయలసీమలోని నాలుగు జిల్లాలు, శ్రీకాకుళంతో సహా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు గ్రాంట్ల రూపంలో సాయం అందించనున్నట్లు గతేడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ సాయం అందించకపోగా, ప్రస్తుత బడ్జెట్‌లో కనీసం దాని ప్రస్తావన లేదు.జిల్లా కేంద్రాస్పత్రికి కేన్సర్‌ సెంటర్‌ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాస్పత్రుల్లో కేన్సర్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. జిల్లాలో టెక్కలిలో ఉన్న జిల్లా కేంద్రాస్పత్రిలో సెంటర్‌ ఏర్పాటు కానుంది. ఇది కార్యాచరణలోకి వస్తే కేన్సర్‌ పరీక్షలు, చికిత్స కోసం విశాఖతో పాటు జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవస్థలు తప్పనున్నాయి.కొత్త పన్ను విధానంపై వేతనజీవుల పెదవివిరుపుఆదాయపు పన్ను పరిమితి విషయంలో ఉద్యోగులు ఆశించినంతగా ఊరట దక్కలేదు. ఉద్యోగులు పొందే మూల వేతనంలో రూ.12 లక్షల వరకు ఆదాయం పొందుతున్న వారికి పన్ను మినహాయించినా పాత శ్లాబులే కొనసాగించడంతో పెద్దగా ఒరిగేదేమీ ఉండడదని ఉద్యోగులు పెదవివిరుస్తున్నారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఏడాదికి రూ.14.50 లక్షల జీతం పొందితే, అందులో కొత్త పన్ను విధానం ప్రకారం రూ.75 వేలను స్టాండర్డ్‌ డిడక్షన్‌ కింద మినహాయిస్తారు. మిగిలిన రూ.13.75 లక్షలకు పన్ను వర్తింపజేయనున్నారు. కొత్త విధానం ప్రకారం రూ.నాలుగు లక్షల్లోపు ఆదాయం పొందుతున్న వారికి పన్ను మినహాయింపు ఇస్తున్న నేపథ్యంలో దాన్ని మినహాయించి రూ.9.75 లక్షలకు ఆయా శ్లాబ్‌ల ప్రకారం పన్ను మదింపు చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో ఇన్సూరెన్స్‌, ఎల్‌ఐసి వంటి సేవింగ్స్‌ తగ్గిపోతాయనే అభిప్రాయం ఉద్యోగుల్లో వినిపిస్తోంది. జిల్లాలో సుమారు 24 వేల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో ఐదు వేల మంది వరకు ప్రయోజనం పొందవచ్చని ఉద్యోగ సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు.

➡️