కె.విజరు కుమార్, జిల్లా ప్రజా రవాణాధికారి
- సమర్థవంతంగా డ్రైవర్ల శిక్షణకార్గో సర్వీసులు వేగవంతం
- జిల్లా ప్రజా రవాణాధికారి కె.విజరు కుమార్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ప్రయాణికులకు ఆర్‌టిసి అందిస్తున్న సేవలు మరింత మెరుగుపరచడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి కె.విజరు కుమార్ తెలిపారు. ఆర్‌టిసి డ్రైవింగ్ స్కూల్ ద్వారా సమర్థవంతమైన డ్రైవర్ల శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల్లో భాగంగా కార్గో సర్వీసులను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని తెలిపారు. పలు అంశాలను ‘ప్రజాశక్తి’ ముఖాముఖిలో వెల్లడించారు.
ఆర్‌టిసి సేవల్లో మెరుగుదలకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
జిల్లాలో మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్‌టిసి సర్వీసులు నడుపుతున్నాం. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న రూట్లలో, రోడ్లు సరిగా లేని ప్రాంతాలకు మినహా అన్ని ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నాం. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో భాగంగా ఒడిశాతో పాటు తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాం. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు వేస్తున్నాం. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, రామచంద్రాపురం, అమలాపురం, అనకాపల్లి, భద్రాచలం ప్రాంతాలకు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సమయానుకూలంగా నిర్దిష్టమైన వేళల్లో వీటిని నడుపుతున్నాం. సకాలంలో బస్సులు రావడం, ప్రయాణికులను సురక్షితంగా సకాలంలో గమ్యానికి చేర్చుతున్నాం.
కార్గో సర్వీసులు ఎలా ఉన్నాయి?
సంస్థ ఆదాయం పెంపు కోసం 2017 నుంచి కార్గో విధానాన్ని ఆర్‌టిసి అమల్లోకి తీసుకొచ్చింది. అది విజయవంతం కావడంతో కార్గో డోర్ డెలివరీ విధానాన్ని గత నవంబరు నుంచి అమలు చేస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం -1, 2 డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపోల్లో కార్గో డోర్ డెలివరీని ప్రవేశపెట్టింది. అన్ని డిపోల పరిధిలో కాంట్రాక్టు విధానంలో కార్గో డోర్ డెలివరీలను ఏజెన్సీలకు అప్పగించింది. ఆ ఏజెన్సీలు కవర్లు, వస్తువులను డోర్ డెలివరీ చేస్తున్నాయి. ఆర్‌టిసి కార్గోలో 50 కేజీల లోపు పార్శిళ్లకు డోర్ డెలివరీ సౌకర్యం కల్పించింది. జిల్లాలో ఉన్న అన్ని ఆర్‌టిసి బుకింగ్ కౌంటర్ల నుంచి ఎంపిక చేసిన ప్రదేశాలకు డోర్ డెలివరీ చేస్తున్నాం.
కార్గో సర్వీసులకు ప్రజాదరణ ఎలా ఉంటోంది?
ప్రైవేటు కార్గో సర్వీసుల కంటే ఆర్‌టిసి సేవలు చౌకగా అందించడంతో అందరికీ అందుబాటులో ఉన్నాయి. డోర్ డెలివరీ చేసేందుకు కేజీ లోపు రూ.18, కేజీ నుంచి ఆరు కేజీల వరకు రూ.30, 10 కేజీల వరకు రూ.36, 10 నుంచి 25 కేజీల వరకు రూ.48, 50 కేజీల వరకు రూ.50 వసూలు చేస్తున్నాం. ప్రస్తుతానికి 50 కేజీల వరకే డోర్ డెలివరీ అవకాశం ఉంది. కార్గో సెంటర్ల పరిధిలో పది కిలోమీటర్ల వరకు మాత్రమే డోర్ డెలివరీ చేస్తున్నాం. ప్రజల నమ్మకం, ఆదరణ వల్లే అనుకున్న లక్ష్యాలను అందుకోగలుగుతున్నాం. 2017లో పార్సిల్ లాజిస్టిక్ వ్యాపారం ప్రారంభమై, ఇప్పుడు అన్నిరకాల సేవలు అందుబాటులోకి తీసుకురావడమైంది.
డ్రైవింగ్ స్కూల్‌ను నిర్వహణ ఎలా సాగుతోంది?
జిల్లాలో శ్రీకాకుళం కేంద్రంగా ఆర్‌టిసి డ్రైవింగ్ స్కూల్‌ను నిర్వహిస్తున్నాం. ఒక్కో బ్యాచ్‌లో 16మందికి శిక్షణ ఇస్తున్నాం. ఇంతవరకు 16 బ్యాచ్‌లు శిక్షణ పూర్తయింది. శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికేట్‌తో పాటు హెవీ లైసెన్స్‌ను రవాణా శాఖ ద్వారా అందిస్తున్నాం. ఇక్కడ చేరిన వారికి ఒక్క డ్రైవింగ్ మాత్రమే కాకుండా మెకానికల్ వర్కు నేర్చు కునేందుకు వీలుంటుంది. శిక్షణ కోర్సు పూర్తి చేసుకు న్న వారికి ఆర్‌టిసిలో గానీ, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు పొందడానికి వీలుంది.