వివరాలు సేకరిస్తున్న ఎమ్మెల్యే శిరీష
ప్రజాశక్తి- పలాస
నియోజకవర్గ పరిధిలోని పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలకు తాగునీరు అందించే ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయ విలువైన పత్రాలను అపహరించడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వంతో కరస్పాండెన్స్ చేసిన వివిధ అభివృద్ధి చేసిన విలువైన పత్రాలు, అభివృద్ధి పనులకు సంబంధించి అంచనా పత్రాలు అవి. కార్యాలయం మార్పిడి జరగ్గానే వాటిని భద్రపరచాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా పాత ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయంలో విడిచి పెట్టడం, వాటిని అమ్ముకొని జీవనం సాగించాలనే చిత్తుకాగితాలు ఏరుకునే వారు సేకరించి కిలోల చొప్పున అమ్ముకోవడం చకచకా జరిగిపోయింది. తీరా అవి విలువైన ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయానికి సంబంధించిన పత్రాలని తెలియడంతో అంతా నెవ్వెరపోయారు. ఈ పత్రాలను అధికారులు చిత్తుకాగితాలని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రోడ్డుపై చిత్తు కాకితాలు ఏరుకునే వారి కంట ఆ పత్రాలు కనిపించడంతో వెనుక పాడుబడిన కిటికీని తొలగించి కార్యాలయంలోనికి ప్రవేశించి వాటిని మూటకట్టి రూ.600లకు అమ్ముకున్నారు. ఈ సంఘటన సోమవారం జరగ్గా, మంగళవారం మధ్యాహ్నం సంబంధిత అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. అధిఆకరులు కార్యాలయం తెరవగా అందులో పత్రాలు కనిపించకపోవడం, కిటికీ పగలు కొట్టడం చూసి సమీప ఎంపిడిఒ కార్యాలయం సిసి ప్యూటేజి పరిశీలించారు. వాటిని ఉదయం పూటే దొంగలు ఎత్తుకెళ్లి చిత్తుకాగితాలుగా అమ్మారని ధ్రువీకరించుకున్నారు. ఈ విషయం సిఎంఒ కార్యాలయం నుంచి కూడా వివరాలు కోరారు. ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆర్‌డిఒ భరత్ నాయక్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ జార్జ్ బెనహర్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించడంతో కాశీబుగ్గ సిఐ విజయానంద్ సంబంధిత పత్రాలన్నీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఆర్‌బ్ల్యుఎస్ ఎఇ ప్రసన్న, సిబ్బందితో సంబంధిత పత్రాల వివరాలు సేకరించాలని ఆదేశించారు. 2022లో ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ కార్యాలయాన్ని అనకాపల్లి తరలించారు. అప్పటికే శిథిలావస్థలో ఉన్న ఆర్‌డబ్ల్యుఎస్ డివిజన్ కార్యాలయాన్ని ఇఇ కార్యాలయంగా మార్చారు. ఆ సమయంలో 2007 తర్వాత ఉన్న ఫైల్స్, ఎం.బుక్స్, విలువైన పత్రాలను తీసుకువెళ్లారు. 2007 ముందు ఉన్న ఫైల్స్ పత్రాలను విడిచి పెట్టడంతో వాటికి రక్షణ లేకుండాపోయింది.