మాట్లాడుతున్న బోయిన సత్యనారాయణ
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
సహారా ఖాతాదారులకు డిపాజిట్ సొమ్మును తక్షణమే చెల్లించాలని సహారా కస్టమర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బోయిన సత్యనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని ఆనందమయి కన్వెన్షన్ హాల్‌లో సహారా ఏజెంట్లు, ఖాతాదారుల సంక్షేమ సంఘం సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహారా చెల్లింపులు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో 12 ఏళ్లలో 7,674 మంది ఏజెంట్లు, ఖాతాదారులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా ఖాతాదారులకు గడువు ముగిసినా డిపాజిట్లకు చెల్లింపులు చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా సుమారు ఐదు వేల బ్రాంచ్‌లకు గానూ వెయ్యి బ్రాంచ్‌లను కొనసాగిస్తూ మిగిలిన నాలుగు వేల బ్రాంచ్‌లను మూసివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు సహారా యాజమాన్యం ఎటువంటి వ్యాపారం చేయకూడదని 2022 మార్చిలో షరతు విధించినా, ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ పద్ధతిలో వ్యాపారం చేస్తోందని విమర్శించారు. గతంలో ఐదుసార్లు ప్రజలకు ఇవ్వాల్సిన బకాయి కంటే మూడు రెట్లు ఆస్తులు ఉన్నట్లు యాజమాన్యం ప్రకటించినా, నేటికీ ఖాతాదారులకు చెల్లించడం లేదన్నారు. దీనివల్ల వేలాది ఏజెంట్లు, డిపాజిట్‌దారులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సహారా బాదితులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు బైపల్లి సత్యరాజు, కార్యదర్శి కె.వి ప్రసాదరావు, జామి కొండలరావు, సహారా ఏజెంట్లు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.