పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వెంకటేశ్వర్లు తదితరులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ విద్యారంగ ఆర్థిక సమస్యలపై ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సును నగరంలోని అంబేద్కర్ కళావేదికలో ఈనెల 31వ తేదీన నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో సదస్సు పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన 117 జిఒ వల్ల పాఠశాల విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,512 ప్రాథమిక పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడే పనిచేస్తున్నారని చెప్పారు. ఒకే మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా జిఒ నంబరు 117 రద్దు చేస్తున్నామని చెప్తూ అదే సారాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. దీనివల్ల 1, 2 తరగతుల ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలలు కనుమరుగవుతున్నాయని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు పూర్తయినా ఉపాధ్యాయ, ఉద్యోగుల 12వ పిఆర్‌సి కమిషన్ చైర్మన్‌ను ఇంతవరకు నియమించలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్ల బకాయిలున్నా వాటిని చెల్లించకపోవడం అన్యాయమన్నారు. మరోవైపు డిఎలనూ చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచారన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ఆర్థిక అంశాలు తక్షణం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే డిమాండ్ తో నిర్వహించే సదస్సును ఉత్తరాంధ్ర ఉపాద్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్ కుమార్, జిల్లా అధ్యక్షులు ఎల్.బాబూరావు, ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, గౌరవాధ్యక్షులు వైకుంఠరావు, సహాధ్యక్షులు దాలయ్య, కోశాధికారి రవికుమార్, కార్యదర్శులు హెచ్.అన్నాజీరావు, భాస్కరరావు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.