ఎసిబికి చిక్కిన బాలరాజు (పింక్ చొక్కా)
- రూ.25 వేలు లంచంతో పట్టుబడిన బాలరాజు
ప్రజాశక్తి – అరసవల్లి
జిల్లా కేంద్రంలోని బిసి వెల్ఫేర్ సీనియర్ అసిస్టెంట్ బి.బాలరాజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. బిల్లులు ప్రాసెస్ చేసేందుకు రూ.25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఎసిబి డిఎస్‌పి బి.వి.ఎస్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఇంక్రిమెంట్లు, ఎంట్రీ బిల్లుల ప్రాసెస్ చేసేందుకు అదే శాఖకు చెందిన పలు బిసి హాస్టళ్లలో పనిచేసే అటెండర్, కుక్‌లను రూ.25 వేలు లంచాన్ని బిసి వెల్ఫేర్ సీనియర్ అసిస్టెంట్ బాలరాజు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేక వారు శ్రీకాకుళం నగరంలోని ఎసిబి అధికారులను ఆశ్రయించారు. పధకం ప్రకారం డబ్బులు ఇచ్చేందుకు బుధవారం సాయంత్రం బాలరాజుకు ఫోన్ చేయగా, శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి రావాలని వారికి సూచించాడు. అక్కడే మాటు వేసిన ఎసిబి అధికారులు లంచం సొమ్మును బాలరాజు అందుకుంటుండగా పట్టుకున్నారు. ఈ క్రమంలో బాలరాజు తన వద్ద ఉన్న సొమ్మును తుప్పల్లో విసిరేశాడు. బాలరాజును అక్కడునంచి బిసి వెల్ఫేర్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. బిసి వెల్ఫేర్‌శాఖలో 2016లో చోటుచేసుకున్న ఉపకార వేతనాల అవకతవకల్లో ఈయనపై ఎసిబి కేసు కూడా ఉందని తెలిపారు. దాడుల్లో సిఐలు రమణ, కె.భాస్కరరావు, ఎస్‌ఐ సత్యారావు పాల్గొన్నారు.