మాట్లాడుతున్న మాజీ ఎంపీ మిడియం బాబూరావు
జిల్లాలో ఒక్క గ్రామమూ లేకపోవడం విచారకరం
నాన్ షెడ్యూల్ గిరిజనులకు తీవ్ర వివక్షమాజీ ఎంపీ మిడియం బాబూరావు
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
జిల్లాలో శతశాతం గిరిజనులున్న గ్రామాలు సైతం ఐదో షెడ్యూల్‌కు నోచుకోకపోవడంతో ఆదివాసీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కో చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు అన్నారు. నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఐటిడిఎ కేంద్రంగా సీతంపేట మండలంలో 16 పంచాయతీలే ఐదో షెడ్యూల్‌లో ఉన్నాయన్నారు. ఐటిడిఎ పరిధిలోని ఆరు మండలాల పరిధిలోని 450 గ్రామాల్లో పూర్తిగా గిరిజనులే నివాసముంటున్నా, ఐదో షెడ్యూల్‌లో చేర్చడం లేదని విమర్శించారు. జిల్లాల విభజన తర్వాత సీతంపేట ఐటిడిఎ, పార్వతీపురం మన్యం జిల్లాలోకి వెళ్లిపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో ఒక్క గ్రామమూ ఐదో షెడ్యూల్‌లో లేకపోవడం విచారకరమన్నారు. ఐదో షెడ్యూల్‌లో గ్రామాలు లేకపోవడంతో 1/70, పీసా వంటి చట్టాలు అమలు కావడం లేదన్నారు. నాన్ షెడ్యూల్ గ్రామాల్లో ఉన్న గిరిజనులకు తహశీల్దార్లు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదని చెప్పారు. ఉద్యోగాలు, రిజర్వేషన్లు వంటి అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్ షెడ్యూల్‌లో ఉన్న గిరిజన గ్రామాలు తీవ్ర వివక్షకు గురవుతున్నాయన్నారు. ఆదివాసీల భూముల రక్షణ, సంక్షేమం కోసం తక్షణమే రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి, రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.జిల్లాలో 20 రకాల అటవీ ఉత్పత్తులను గిరిజనులు సేకరిస్తున్నా, జిసిసి వాటిని కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల అవి నిర్వీర్యమైపోయాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా, అటవీ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఐదో షెడ్యూల్‌లో లేని గిరిజన గ్రామాల్లో పవర్ ప్లాంట్లు, ప్రాజెక్టులు, గనుల తవ్వకం వంటివి చేపట్టడానికి వీల్లేదన్నారు. గిరిజనులు నివసిస్తున్న బూర్జ-సరుబుజ్జిలి ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. గ్రామాలు ఐదో షెడ్యూల్‌లో లేకపోయినా, ఆరో షెడ్యూల్‌లోని నిబంధనల ప్రకారం గ్రామసభ ఆమోదం లేకుండా ఏర్పాటు చేయడానికి సాధ్యపడదన్నారు. పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయదలిస్తే గిరిజనుల జీవితంపై పడే ప్రభావం, పర్యావరణ మదింపు నివేదికలతో గిరిజనులకు ఏవిధంగా ప్రయోజనకరమో లేక వారికి ఉద్యోగాలేమైనా ఇస్తారా అనే అంశాలను చట్టం ప్రకారం అమలు చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధానాలను విరమించుకోవాలని హితవు పలికారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అపారమైన సహజ వనరులు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడానికే ప్రభుత్వం ఐటిడిఎ ద్వారా వర్క్ షాపులను నిర్వహిస్తోందని చెప్పారు. సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొంతు అప్పారావు, ఎన్.అప్పన్న, జిల్లా ఉపాధ్యక్షులు సవర పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.సిటిఆర్‌ను కలిసిన బాబూరావుసిపిఎం సీనియర్ నాయకులు చౌదరి తేజేశ్వరరావును ఆయన నివాసంలో బాబూరావు కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు తదితరులున్నారు.