వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
- కమిషనర్‌ను కోరిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలోని వసతిగృహాల వద్ద మురుగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.సంతోష్, బాలికల విభాగం కో-కన్వీనర్ దివ్య నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.వి.వి.డి ప్రసాదరావును కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబరులో ఆయన్ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. విశాల మైదానం గల ముహిళా కళాశాలలో విద్యార్థినుల సంరక్షణలో భాగంగా గిరిజన, సాంఘిక సంక్షేమ, బిసి, వికలాంగుల వసతిగృహాలు ఉన్నాయని చెప్పారు. వీటి నుంచి వస్తున్న వాడుక నీరు, వ్యర్థాలు వెళ్లేందుకు కాలువల్లేక మురుగునీరు పేరుకుపోతోందని చెప్పారు. సుమారు 800 మంది విద్యార్థినులు ఈ వసతిగృహాల్లో ఉంటున్నారని వివరించారు. వారు వినియోగించే వాడుక నీరు వెళ్లేందుకు అవుట్‌లెట్ లేక కళాశాల ఆవరణలో మురుగునీరు చేరుతోందని వివరించారు. కళాశాల విద్యార్థినులతో పాటు వసతిగృహాల్లో ఉన్న వారు, చుట్టూ నివాసముంటున్న వారు మురుగునీరు వల్ల అవస్థలు పడుతున్నారని వివరించారు. దోమలు విపరీతంగా పెరిగి అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. మురుగునీరు వెళ్లేందుకు వీలుగా కాలువలను నిర్మించాలని కోరారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఖగేష్ తదితరులు పాల్గొన్నారు.