శభాష్‌ పోలీస్‌

ఎన్నికల నోటిఫికేషన్‌

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్‌పి రాధిక (ఫైల్‌)

  • ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ఎన్నికల సమయంలో కఠోర శ్రమ
  • పక్కా ప్రణాళికలతో ముందుకు సాగిన వైనం

అన్ని విభాగాల సమన్వయంతో కార్యాచరణ సార్వత్రిక ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విజయం సాధించారు. ఎన్నికల కోడ్‌ మొదలైన నాటి నుంచి కౌంటింగ్‌ వరకు జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. హోంగార్డు నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు రాత్రీ పగలు తేడా లేకుండా శాంతిభద్రతల విషయంలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజాశక్తి- శ్రీకాకుళం క్రైమ్‌

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి పోలీసులు ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టాలైన పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు ప్రశాంతంగా ముగియడంలో పోలీసు యంత్రాంగం కీలకపాత్ర పోషించింది. ఇందుకోసం హోరగార్డుల నుంచి ఎస్‌పి వరకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 2,500 మంది సిబ్బంది రెండు నెలల పాటు చెమటోడ్చారు. ఎక్కడా లాఠీఛార్జి అన్న పదమే వినబడకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. ఒకవైపు ఎన్నికల విధులు, మరోవైపు పార్టీల సభలు, సమావేశాలకు అనుమతులు, ముఖ్య నేతల పర్యటనలకు పటిష్ట బందోబస్తు కల్పించారు.ప్రణాళికాబద్ధంగా ముందుకు…ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పట్నుంచే ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. దీంతో ఇటు జనం, అటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మే 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం రెండు వేల మంది పోలీసులను వినియోగించారు. 11 పారామిలటరీ బృందాలు, రెండు ప్లాటూన్ల కేంద్ర బలగాలను మోహరించారు. మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీలతో పాటు సిఐ, డిఎస్‌పి, అదనపు ఎస్‌పి స్థాయి అధికారులతో స్పెషల్‌ స్టాటిక్‌ ఫోర్స్‌, క్విక్‌ యాక్షన్‌ బృందాలను నియమించారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలపై ముందుగానే డేగకన్ను పెట్టారు. అన్ని మండలాల్లోనూ పోలీసు కవాతులు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి ఎన్నికల సమయంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా 4,624 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేయడంతో పాటు వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పలు పార్టీలతో, నాయకులతో సమావేశాలు నిర్వహించి శాంతిభద్రతలకు సంబంధించిన సూచనలు చేశారు. చెక్‌పోస్టులు, సిసి కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లాలో మద్యం, నగదు తరలింపుపై పూర్తిస్థాయిలో నిఘా పెంచారు. ఎస్‌పి రాధిక, ఎఎస్‌పిలు ప్రేమకాజల్‌ ఎప్పటికప్పుడు చెక్‌పోస్టుల తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతఎచ్చెర్లలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఆ ప్రాంతమంతా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదనంగా ఒక వలయంలో పోలీసులతో భద్రత కల్పించారు. ఇందుకోసం 1459 మంది పోలీసులను వినియోగించారు. వీరితో పాటు ఒక కంపెనీ సిఐఎస్‌ఎఫ్‌, ఎపిఎస్‌పి ఒక ప్లాటూన్‌ బెటాలియన్‌ అదనపు బలగాలు బందోబస్తు నిర్వహించాయి. పోలీసు సిబ్బంది ఎండను సైతం లెక్క చేయకుండా చెక్‌పోస్టుల వద్ద పహారా కాశారు. కౌంటింగ్‌కు వెళ్లే ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తుతో పాటు రక్షక్‌ వాహనాలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశాయి. పోలీసులు కౌంటింగ్‌ ప్రక్రియను ఛాలెంజ్‌గా తీసుకుని ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చర్యలు చేపట్టారు. కౌంటింగ్‌ కేంద్రాలతో పాటు జిల్లావ్యాప్తంగా సెక్షన్‌ 30, 144 సెక్షన్‌ అమలు చేశారు. ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.సమన్వయంతో సజావుగా నిర్వహించాంపోలింగ్‌ ముందు నుంచి కౌంటింగ్‌ వరకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాం. ఒక్కచోట కూడా లాఠీఛార్జి గానీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గానీ చోటుచేసుకోలేదు. నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టగలిగాం. సభలు, సమావేశాలకు అనుమతులు, కీలక నేతల పర్యటనలతో పాటు పటిష్ట నిఘా, అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించగలిగాం.- జి.ఆర్‌ రాధిక, ఎస్‌పి

➡️