వైసిపిలో అవమానం

గత కొంతకాలంగా వైసిపిలో ప్రాధాన్యత

మాట్లాడుతున్న కృపారాణి

  • కేంద్ర మాజీ మంత్రి కృపారాణి రాజీనామా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

గత కొంతకాలంగా వైసిపిలో ప్రాధాన్యత లేకపోవడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేశానని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కల్లి కృపారాణి కన్నీటి పర్యంతమయ్యారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, సిఎం జగన్‌కు పంపారు. నగరంలోని హోటల్‌ గ్రాండ్‌లో ఆమె తన భర్త కిల్లి రామ్మోహనరావుతో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ఆలోచనలు, ఆశయాలు నచ్చి 2019 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరానని అన్నారు. అయితే పార్టీలో ఆశించినస్థాయిలో తనకు ఆదరణ లభించలేదన్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచీ అర్ధాంతరంగా తప్పించారని, దీనిపై తనకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. జిల్లాలోని కొందరు నాయకుల వల్లే వైసిపి పెద్దలు తనను వ్యూహాత్మకంగా పక్కన పెట్టారని అన్నారు. ఉత్తరాంధ్రాలో పదవులు కట్టబెట్టిన వారితో పోల్చుకుంటే తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ సైతం ఎక్కడా పోటీ చేసే అవకాశం కల్పించకుండా ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని వాపోయారు. ఎంపీ అభ్యర్థిగా టిక్కెట్‌ ఇస్తామని విజయసాయిరెడ్డి చెప్పారని, కానీ, అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని అన్నారు. ఐదున్నరేళ్లుగా పార్టీలో కార్యకర్తగా పనిచేశానని, కొన్ని నెలలుగా పార్టీలో తన స్థానమేమిటో తేల్చుకోలేక పోయానని అన్నారు. ఈ విషయంపై సిఎంను కలవడానికి ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, తానేంటో నిరూపించుకుంటానని అన్నారు. ఏ పార్టీలో చేరేది తర్వాత వెల్లడిస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అన్ని పార్టీల నుంచీ ఆహ్వానం ఉందని, కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆమెతో పాటు పలువురు టెక్కలి ప్రాంత నాయకులు ఉన్నారు.

➡️